Jammu And Kashmir: రణరంగంగా జమ్మూకశ్మీర్ అసెంబ్లీ.. ఎమ్మెల్యేల బాహాబాహీ.. వీడియో ఇదిగో!

Chaos in Jammu and K Assembly after Khurshid Ahmad Sheikh shows Article 370 banner
  • ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలంటూ ఖుర్షీద్ అహ్మద్ షేక్ బ్యానర్ ప్రదర్శన
  • దానిని లాక్కుని చింపేసిన బీజేపీ సభ్యులు
  • పిడిగుద్దులు కురిపించుకున్న ఎమ్మెల్యేలు
  • సభను వాయిదా వేసిన స్పీకర్
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ గురువారం రణరంగంగా మారింది. కొందరు ఎమ్మెల్యేలు బాహాబాహీకి దిగి పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలంటూ జైలుపాలైన బారాముల్లా లోక్‌సభ ఎంపీ ఇంజినీర్ రషీద్ సోదరుడు ఖుర్షీద్ అహ్మద్ షేక్ బ్యానర్ ప్రదర్శించిన తర్వాత అసెంబ్లీలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. 

ఆరేళ్ల తర్వాత తొలిసారి సోమవారం జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నాలుగో రోజైన నేడు అసెంబ్లీలో ఘర్షణ వాతావరణం నెలకొంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టాలంటూ నిన్న సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ రోజు సభ ప్రారంభం కాగానే పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) తాజాగా నేడు కూడా ఆర్టికల్ 370, 35(ఏ) ని పునరుద్ధరించాలంటూ తీర్మానాన్ని ప్రతిపాదించింది. బీజేపీ సభ్యులు దీనిని వ్యతిరేకించడంతో గందరగోళం ఏర్పడింది. 

ప్రతిపక్ష నేత, బీజేపీ ఎమ్మెల్యే సునీల్‌శర్మ ఈ తీర్మానంపై మాట్లాడుతుండగా.. అవామీ ఇత్తెహాద్ పార్టీ ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్ షేక్ వెల్‌లోకి దూకి బ్యానర్ ప్రదర్శించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ సభ్యులు ఆ బ్యానర్‌ను లాక్కుని చింపి పడేశారు. దీంతో స్పీకర్ అబ్దుల్ రహీం రాథెర్ సభను వాయిదా వేశారు.

నిన్న కూడా అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తీర్మానాన్ని స్పీకర్ ఆమోదించగానే స్థానిక పార్టీలు ప్రశంసించాయి. అయితే, ప్రతిపక్ష బీజేపీ మాత్రం దీనిని వ్యతిరేకించింది. దానిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది.  
Jammu And Kashmir
Khurshid Ahmad Sheikh
Article 370
Jammu And Kashmir Assembly

More Telugu News