Andhra Village: అమెరికాలో ట్రంప్ గెలుపు.. ఆంధ్రా విలేజ్ లో సంబరాలు

Why This Andhra Village Is Celebrating Donald Trump Election Victory
  • అగ్రరాజ్యం సెకండ్ లేడీగా ఉష చిలుకూరి
  • వడ్లూరులో బాణసంచా కాల్చి, స్వీట్లు పంచిన గ్రామస్థులు
  • ఆలయంలో ప్రత్యేక పూజలు
అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ గెలవడంతో ఆంధ్రాలోని వడ్లూరు గ్రామస్థులు సంబరాలు జరుపుకున్నారు. అగ్రరాజ్యానికి ఆంధ్రా అల్లుడే ఉపాధ్యక్షుడు కాబోతున్నాడని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సెకండ్ లేడీ పూర్వీకులది తమ గ్రామమేనని, ఇప్పటికీ వారి బంధువులు ఇక్కడ ఉన్నారని చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని వడ్లూరు ఉష చిలుకూరి పూర్వీకుల గ్రామం. ప్రస్తుతం ఉష తాత రామశాస్త్రి మేనకోడళ్లయిన పారిపూడి నాగమణి, దువ్వూరి విజయలక్ష్మి గ్రామంలోనే ఉంటున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్, వాన్స్ గెలవడంతో గ్రామస్థులు సంబరాలు జరుపుకున్నారు. గ్రామంలోని ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, స్వీట్లు పంచుకున్నారు.

వడ్లూరులోని 20 సెంట్ల స్థలాన్ని చిలుకూరి కుటుంబ సభ్యులు గ్రామానికి దానమిచ్చారని మాజీ సర్పంచి పెనుమత్స శ్రీనివాసరాజు పేర్కొన్నారు. అందులో సాయిబాబా ఆలయం, కల్యాణ మండపం నిర్మించామని చెప్పారు. అమెరికా సెకండ్ లేడీ ఉష చిలుకూరి తమ గ్రామానికే కాదు యావత్ భారత దేశానికీ గర్వకారణమని ఆలయ పూజారి చెప్పారు. ఉష ఎన్నడూ తమ గ్రామానికి రాలేదని, ఆమె తండ్రి రాధాకృష్ణ మాత్రం మూడేళ్ల కిందట వచ్చి వెళ్లారని తెలిపారు. ఆ సమయంలో గ్రామ పరిస్థితిని ఆలయాన్ని పరిశీలించి వెళ్లారని చెప్పారు. ఉష తన మూలాలను గుర్తుంచుకుని పూర్వీకుల గ్రామం వడ్లూరుకు సాయంచేస్తే బాగుంటుందని కోరారు.
Andhra Village
Trump Victory
Vadluru
Usha Vance
Usha Chilukuru

More Telugu News