Chandrababu: జేడీ వాన్స్ దంప‌తుల‌ను ఏపీకి ఆహ్వానిస్తాం: సీఎం చంద్ర‌బాబు

CM Chandrababu Heartfelt Congratulations to JD Vance Couple
  • ఉపాధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్న జేడీ వాన్స్‌కు చంద్ర‌బాబు అభినంద‌న‌లు
  • ఆయ‌న భార్య తెలుగు మూలాలు ఉన్న ఉషా వాన్స్ చ‌రిత్ర సృష్టించార‌ని కితాబు
  • ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సమాజానికి ఇది గర్వకారణమ‌న్న చంద్ర‌బాబు
అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో రిప‌బ్లిక‌న్ పార్టీ విజ‌య‌ఢంకా మోగించింది. దీంతో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి యూఎస్ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కు వివిధ దేశాధినేత‌ల‌తో పాటు రాజ‌కీయ నాయ‌కులు, సెల‌బ్రిటీలు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు కూడా ట్రంప్‌కు అభినంద‌నలు తెలిపారు.  

అలాగే యూఎస్‌ ఉపాధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్న జేడీ వాన్స్‌కు చంద్ర‌బాబు 'ఎక్స్' (ట్విట్ట‌ర్) వేదిక‌గా అభినంద‌న‌లు తెలిపారు. ఆయ‌న భార్య తెలుగు మూలాలు ఉన్న ఉషా వాన్స్ చ‌రిత్ర సృష్టించార‌ని చంద్ర‌బాబు మెచ్చుకున్నారు. 

"అమెరికా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన జేడీ వాన్స్‌కు నా హృదయపూర్వక అభినందనలు. ఆయ‌న‌ విజయం ఒక చారిత్రాత్మక ఘట్టం. ఆంధ్రప్రదేశ్‌లో మూలాలున్న ఉషా వాన్స్, అమెరికా రెండవ మహిళగా సేవలందించ‌బోతున్న తెలుగు వారసత్వపు మొదటి మహిళగా అవతరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సమాజానికి ఇది గర్వకారణం. వారిని ఆంధ్రప్రదేశ్ పర్యటనకు ఆహ్వానించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను" అని సీఎం చంద్ర‌బాబు ట్వీట్ చేశారు.
Chandrababu
JD Vance
Usha Vance
Andhra Pradesh
USA

More Telugu News