తెలుగు వారిని అవమానించలేదు.. నటి కస్తూరి వివరణ
- తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపణ
- తనపై నెగెటివిటీ తెచ్చేందుకు డీఎంకే పార్టీ కుట్ర
- ‘తెలుగు నా మెట్టిల్లు, తెలుగువారంతా నా కుటుంబం’ అంటూ ట్వీట్
ఈమేరకు సోమవారం కస్తూరి వరుస ట్వీట్లతో వివరణ ఇచ్చారు. తాను తెలుగు వారిని, తెలుగు జాతిని అవమానించలేదని ఆమె స్పష్టం చేశారు. ‘నాపై ఎంతో ప్రేమాభిమానాలు చూపించే తెలుగు వారు ఈ తప్పుడు ప్రచారం నమ్మవద్దని కోరుతున్నా’ అంటూ కస్తూరి ట్వీట్ చేశారు.
ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో తమిళనాడులో స్థిరపడ్డ తెలుగు వారిని ఉద్దేశించి కస్తూరి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో నటి కస్తూరి స్పందించారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, డీఎంకే నేతలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని వివరించారు.