Wriddhiman Saha: రిటైర్‌మెంట్ ప్రకటించిన భారత వికెట్ కీపర్

Wriddhiman Saha announced retirement and ongoing Ranji Trophy season is last
  • ప్రస్తుత రంజీ సీజన్ చివరిదని ప్రకటించిన వృద్ధిమాన్ సాహా
  • బెంగాల్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడుతున్న సాహా
  • సోషల్ మీడియా వేదికగా రిటైర్‌మెంట్ ప్రకటించిన క్రికెటర్
భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ వృద్ధిమాన్ సాహా క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ తనకు చివరిదని ప్రకటించాడు. ఆఖరిసారిగా తన సొంత జట్టు బెంగాల్ తరపున ఆడుతున్నానని వెల్లడించాడు. ‘‘నా క్రికెట్‌ ప్రయాణంలో ఈ రంజీ సీజన్ చివరిది. రిటైర్ అవడానికి ముందు రంజీ ట్రోఫీలో చివరిగా బెంగాల్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నాను. ఈ అద్భుతమైన నా క్రికెట్ కెరియర్‌లో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ మద్దతు నా కెరీర్‌లో చాలా ముఖ్యమైనది. ఈ సీజన్‌ను గుర్తుంచుకునేలా ముగిద్దాం!" అని సోషల్ మీడియా పోస్ట్‌లో వృద్ధిమాన్ సాహా రాసుకొచ్చాడు. కాగా సాహా వయసు 40 సంవత్సరాలు. ఐపీఎల్‌లో కూడా పలు జట్లకు ఆడాడు.

ఇక దేశవాళీ క్రికెట్ విషయానికి వస్తే 2007 నుంచి బెంగాల్ తరపున ఆడుతున్నాడు. 2022 నుంచి రెండేళ్ల పాటు త్రిపురకు ఆడాడు. అయితే క్రికెట్‌కు వీడ్కోలు పలికే ఉద్దేశంతో 2024 సీజన్‌లో తిరిగి బెంగాల్‌‌ జట్టులోకి వచ్చాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ సీజన్‌లో రెండు, మూడు రౌండ్లలో ఆడాడు. తొలి రౌండ్‌లో యూపీతో జరిగిన మ్యాచ్‌లో సాహా డకౌట్ అయ్యాడు. ఇక కేరళతో జరిగిన మూడో రౌండ్‌ మ్యాచ్‌లో సాహాకి బ్యాటింగ్ రాలేదు.

కాగా ఇటీవల తన రిటైర్‌మెంట్‌పై సాహా మాట్లాడుతూ.. తాను క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రోజు అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి వైదొలగుతానని అన్నాడు. ‘‘గతం, భవిష్యత్తు గురించి ఆలోచించను. వర్తమానంలో మాత్రమే ఉంటాను. ప్రస్తుతం బెంగాల్‌కు ఆడటం గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. గతంలో జరిగినవన్నీ నేను మరచిపోయాను’’ అని ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో ఇటీవలే అన్నాడు. రిటైర్మెంట్ తర్వాత బెంగాల్ క్రికెట్‌కు చేయగలిగిన సాయం చేస్తానని అన్నాడు. తాను క్రికెటర్‌ని కాబట్టి పాలనాపరమైన పాత్రకు బదులుగా కోచింగ్‌ విషయంలో సహాయం చేయడం మంచిదని భావిస్తున్నట్టు పేర్కొన్నాడు.
Wriddhiman Saha
Ranji Trophy
Cricket
Team India

More Telugu News