Narendra Modi: టీబీ వ్యాధిపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన

we will keep working towards a TB free India says PM Narendra Modi
  • భారత్ అద్భుతమైన పురోగతిని సాధించిందన్న ప్రధాని
  • అంకితభావం, వినూత్న పద్ధతుల్లో కృషి ఫలితంగానే సాధ్యమైందని వ్యాఖ్య
  • ఉమ్మడి స్ఫూర్తితో టీబీపై పోరాటాన్ని కొనసాగిస్తామని వెల్లడి
టీబీ (క్షయ) నివారణ విషయంలో అద్భుతమైన పురోగతి సాధించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. టీబీ రహిత భారతదేశాన్ని ఆవిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తూనే ఉంటామని ఆయన వెల్లడించారు. అంకితభావం, వినూత్న రీతిలో ప్రయత్నాల ఫలితంగానే దేశంలో టీబీ తగ్గుదలకు కారణమని అన్నారు. ఇకపై కూడా ‘ఉమ్మడి స్ఫూర్తి’తో టీబీ రహిత భారత్ కోసం పోరాడతామని అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా మోదీ స్పందించారు.

టీబీ నివారణలో భారత్ సాధించిన అద్భుతమైన పురోగతిని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిందంటూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఎక్స్ వేదికగా పెట్టిన పోస్టుపై ప్రధాని మోదీ ఈ మేరకు స్పందించారు. కాగా దేశంలో 2015 నుంచి 2023 మధ్య కాలంలో టీబీ వ్యాప్తి రేటు 17.7 శాతం మేర తగ్గిందని జేపీ నడ్డా పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా టీబీ తగ్గుదల రేటు 8.3 శాతం ఉండగా భారత్‌లో రెట్టింపు ఫలితం ఉందన్నారు. 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో తమ ప్రభుత్వం ‘ని-క్షయ్ పోషణ్ యోజన’ వంటి కీలకమైన కార్యక్రమాలను చేపడుతోందని, తద్వారా జాతీయ టీబీ నిర్మూలన కార్యక్రమాన్ని విస్తరించిందని నడ్డా ప్రస్తావించారు. ఇక మల్టీ-డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్‌క్యులోసిస్‌ చికిత్స కోసం కొత్తగా 'బీపీఏఎల్ఎం డ్రగ్ కోర్స్' ని ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. క్షయవ్యాధిపై జరుగుతున్న పోరాటంలో నిబద్ధతతో కీలక పాత్ర పోషిస్తున్న ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆరోగ్య కార్యకర్తల అవిశ్రాంత ప్రయత్నాలను తాను గుర్తిస్తున్నట్టు నడ్డా చెప్పారు.
Narendra Modi
TB
JP
WHO

More Telugu News