King Charles III: బెంగళూరులో నాలుగు రోజులు రహస్యంగా గడిపిన కింగ్ చార్లెస్ దంపతులు

King Charles III and Queen Camilla spent four private days at a Bengaluru retreat
  • వెల్నెస్‌ ట్రీట్‌మెంట్ కోసం ఎస్ఐహెచ్ఎచ్‌సీ‌కు రాక
  • ప్రైవేటు పర్యటన కావడంతో హంగూ ఆర్భాటం లేకుండా గడిపిన వైనం
  • సింహాసనాన్ని అధిష్టించకముందు తొమ్మిదిసార్లు ఈ కేంద్రాన్ని సందర్శించిన కింగ్ చార్లెస్
కింగ్ చార్లెస్ III, క్వీన్ కెమిల్లా దంపతులు ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా నాలుగు రోజులపాటు బెంగళూరు నగరంలో గడిపారు. వెల్నెస్ ట్రీట్‌మెంట్ కోసం నగర శివారులోని సౌఖ్య ఇంటర్నేషనల్ హోలిస్టిక్ హెల్త్ సెంటర్‌కు (ఎస్ఐహెచ్‌హెచ్‌సీ‌) విచ్చేశారు. అక్టోబర్ 27న చేరుకోగా 30న (బుధవారం) చికిత్స ముగిసింది. రాజుగా కింగ్ చార్లెస్ సింహాసనాన్ని అధిష్టించిన తర్వాత ఆయన భారత్‌ను సందర్శించడం ఇదే తొలిసారని ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌’ కథనం పేర్కొంది. ప్రైవేట్ పర్యటన కావడంతో బహిరంగంగా ఎక్కడా మాట్లాడకుండా గడిపారని తెలిపింది. తిరిగి ఇవాళ (బుధవారం) భారత్ నుంచి బయలుదేరి వెళ్లే అవకాశం ఉందని పేర్కొంది.

కింగ్ చార్లెస్3 దంపతులు ఈ నాలుగు రోజులు ఉదయాన్నే యోగా సెషన్‌తో దినచర్యను ప్రారంభించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. యోగా తర్వాత అల్పాహారం, మధ్యాహ్న భోజనం చేయడానికి ముందు ఆయుర్వేద చికిత్స, భోజనం తర్వాత విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత మరొక రౌండ్ చికిత్సలు చేయించుకునేవారు. చివరిగా యోగా సెషన్‌లో పాల్గొన్నారు. ఇక 9 గంటలకు రాత్రి భోజనం చేసేవారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొంది.

కాగా కింగ్ చార్లెస్ బెంగళూరు నగరంలో పర్యటించడం ఇదే తొలిసారి కాదు. రాజుగా సింహాసనాన్ని అధిష్టించడానికి ముందు గత దశాబ్ద కాలంలో మొత్తం తొమ్మిది సార్లు ఆయుర్వేద చికిత్స చేయించుకున్నారు. అందులో మూడు సార్లు దీపావళి పండగని వెల్నెస్ సెంటర్‌లోనే జరుపుకున్నారు. 2019లో చార్లెస్ 71వ పుట్టినరోజు కూడా అక్కడే జరిగింది.

కాగా కింగ్ చార్లెస్, క్వీన్ కెమిల్లా ఇద్దరూ ప్రస్తుతం విదేశాల పర్యటనలో ఉన్నారు. కామన్వెల్త్ ప్రభుత్వాధినేతల సమావేశానికి హాజరయ్యేందుకు సమోవా వెళ్లి, అక్కడి నుంచి నేరుగా ఇండియా వచ్చారు. కాగా కింగ్ చార్లెస్‌కు క్యాన్సర్‌ నిర్ధారణ అయిన తర్వాత వారికి ఇదే తొలి విదేశీ పర్యటన కావడం విశేషం. 

ఇదిలావుంచితే నోబెల్ గ్రహీత ఆర్చ్ బిషప్ డెస్మండ్ టుటుతో పాటు ఆస్కార్ విజేత, హాలీవుడ్ నటి ఎమ్మా థాంప్సన్, డచెస్ ఆఫ్ యార్క్ సారా ఫెర్గూసన్, మధ్య ఆసియా, ఐరోపాలోని రాజకుటుంబాలతో పాటు అనేక మంది ప్రముఖులు ఎస్ఐహెచ్‌హెచ్‌సీ‌లో చికిత్స చేయించుకున్నారు. ఆయుర్వేదం, హోమియోపతి, నేచురోపతి, యోగాతో కూడిన సమగ్ర వైద్య విధానానికి ఈ కేంద్రం ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది.
King Charles III
Queen Camilla
Bengaluru
SIHHC

More Telugu News