Maharashtra Elections: మహారాష్ట్ర ఎన్నికలు.. 288 స్థానాలకు 8 వేల మంది నామినేషన్లు

Nearly 8 Thousand Candidates Submit Their Nomination Papers In MAHA Polls
  • వచ్చే నెల 20న జరగనున్న పోలింగ్
  • 10,905 నామినేషన్లు దాఖలు చేసిన 7,995 మంది అభ్యర్థులు 
  • గత ఎన్నికల రికార్డును దాటి భారీగా నామినేషన్లు
  • నవంబర్ 4 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు
మహారాష్ట్ర అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు పోటెత్తారు. 288 స్థానాలకు గాను దాదాపు 8 వేల మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వచ్చే నెల 20న పోలింగ్ జరగనుండగా మొత్తం 7,995 మంది అభ్యర్థులు 10,905 నామినేషన్లు దాఖలు చేసినట్టు ఎలక్షన్ కమిషన్ (ఈసీ) వెల్లడించింది.

ఈ నెల 22న నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా 29న ముగిసింది. నిన్న నామినేషన్ల పరిశీలన జరిగింది. నవంబర్ 4న మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. ఆ తర్వాతే బరిలో ఎంతమంది నిలిచారన్న దానిపై స్పష్టత వస్తుంది.

గత ఎన్నికల్లో 5,543 నామినేషన్లు దాఖలు కాగా, ఈసారి ఆ రికార్డు బద్దలైంది. ఆ ఎన్నికల్లో మొత్తం 3,239 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. తాజా, ఎన్నికల విషయానికి వస్తే నాసిక్ జిల్లాలో అత్యధికంగా 361 మంది అభ్యర్థులు 506 నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో 255 మంది నిన్న పేపర్లు సమర్పించారు.

వీరిలో కేబినెట్ మంత్రులు దాదా భూసే (శివసేన) మాలేగావ్ అవుట్ నుంచి, చగన్ భుజ్‌బల్ (ఎన్సీపీ) యేవల్ నుంచి, సుహాస్ కండే (శివసేన) నందగావ్ నుంచి, రాహుల్ ధిక్లే (బీజేపీ) నాసిక్ ఈస్ట్ నుంచి, మాజీ ఎమ్మెల్యే వంత్ గీతే (శివసేన-యూబీటీ) నాసిక్ సెంట్రల్ నుంచి, సిట్టింగ్ ఎమ్మెల్యే సరోజ్ అహిరే ( ఎన్సీపీ) దేవ్‌లాలి నుంచి పోటీపడుతున్నారు.
Maharashtra Elections
Election Commission
Shiv Sena
BJP
NCP

More Telugu News