Lahore: ప్రపంచంలోనే అత్యంత కాలుష్యభరిత నగరం ఇదే!

Lahore retained its place as most polluted city in the world
  • పాకిస్థాన్ లోని లాహోర్ లో అత్యంత ప్రమాదకరంగా వాయు కాలుష్యం
  • 708 పాయింట్లకు చేరిన లాహోర్ నగర ఏక్యూఐ
  • అత్యవసర సందేశం జారీ చేసిన స్థానిక ప్రభుత్వం
  • పౌరులు మాస్కులు ధరించాలని సూచన
ప్రపంచంలోనే అత్యంత కాలుష్య భరిత నగరంగా పాకిస్థాన్ లోని లాహోర్ నగరం తన స్థానాన్ని నిలుపుకుంది. లాహోర్ నగర ఏక్యూఐ (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) 708కి చేరింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిర్దేశించిన ప్రమాణాలతో పోల్చితే లాహోర్ గాలి నాణ్యత 86.2 రెట్లు దారుణంగా ఉందని తాజాగా ఓ నివేదికలో వెల్లడైంది. 

ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి మరియం నవాజ్ షరీఫ్ నాయకత్వంలోని స్థానిక పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వం అప్రమత్తమైంది. లాహోర్ పౌరులకు అత్యవసర సందేశం జారీ చేసింది. పౌరులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, తమ ఇళ్లలోని కిటికీలను, ఇంటి తలుపులను మూసివేయాలని ప్రభుత్వం ప్రజలకు సూచించింది. అంతేకాదు, పాఠశాలల వేళల్లోనూ మార్పులు చేశారు. విద్యాసంస్థలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. 

కాగా, లాహోర్ కు 50 కిలోమీటర్ల దూరంలో ఉండే భారత నగరం అమృత్ సర్ లో సోమవారం నాడు ఏక్యూఐ 189గా నమోదడం గమనార్హం. అయితే, పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ సీనియర్ మంత్రి ఒకరు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. లాహోర్ లో వాయు కాలుష్యానికి కారణం ఢిల్లీ, అమృత్ సర్, చండీగఢ్ నుంచి వస్తున్న పొగ, ధూళి అని ఆరోపించారు.
Lahore
Most Polluted City
World
Pakistan

More Telugu News