Team India: రంజీలో ఆడుతున్న 22 ఏళ్ల యువ బౌలర్‌కు బీసీసీఐ పిలుపు.. కివీస్‌తో మూడో టెస్టులో చోటు!

Harshit Rana was called up to join Indias squad for the 3rd Test against New Zealand at Mumbai

  • సీమర్ హర్షిత్ రాణాకు ముంబై టెస్టులో చోటు దక్కడం దాదాపు ఖాయం!
  • రంజీ ట్రోఫీలో బౌలింగ్, బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన
  • ఇప్పటికే ట్రావెలింగ్ రిజర్వ్‌గా ప్రకటించిన బీసీసీఐ సెలక్టర్లు

భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య చివరిదైన మూడవ టెస్ట్ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ సీమర్ హర్షిత్ రాణా‌ అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. హర్షిత్ రాణా‌ రంజీ ట్రోఫీలో బంతితో పాటు బ్యాటింగ్‌లోనూ రాణించడంతో సెలక్టర్ల దృష్టిలో పడినట్టు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. 

కాగా దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్న 22 ఏళ్ల ఈ యువ ఫాస్ట్ బౌలర్‌ను మూడవ టెస్టుకు ట్రావెలింగ్ రిజర్వ్‌గా బీసీసీఐ ఇటీవలే ప్రకటించింది. ఈ మేరకు 18 మందితో కూడిన ఆటగాళ్ల జాబితాలో హర్షిత్ రాణా పేరుని చేర్చింది. దీంతో శుక్రవారం మొదలు కానున్న  ఈ మ్యాచ్‌లో అతడు అరంగేట్రం చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఇవాళ (మంగళవారం) సాయంత్రమే అతడు ముంబై బయలుదేరి వెళ్లి టీమిండియాతో కలవనున్నాడు. హర్షిత్ రాణా‌ రంజీ ట్రోఫీలో ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రంజీ ట్రోఫీ మూడవ రౌండ్ మ్యాచ్‌లో అస్సాంపై అద్భుతమైన ప్రదర్శన చేశాడు. 

అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 5 వికెట్లు తీయడంతో పాటు అర్ధ సెంచరీ (59) కూడా సాధించాడు. దీంతో అస్సాంపై ఢిల్లీ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. హర్షిత్ రాణా ప్రదర్శనను గుర్తించిన సెలక్టర్లు నేరుగా ముంబై వచ్చేయాలని పిలిచారు. టీమిండియా నుంచి పిలుపు రావడంతో నాలుగవ రౌండ్ రంజీ మ్యాచ్‌లకు హర్షిత్ రాణా దూరం కానున్నాడు. 

కాగా ఇటీవల బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ ఆడిన జట్టులో కూడా హర్షిత్ రాణాకు చోటు దక్కింది. అయితే తుది జట్టులో చోటు దక్కలేదు. 

న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను న్యూజిలాండ్ ఇప్పటికే 2-0 తేడాతో గెలుచుకుంది. చివరి మ్యాచ్‌లోనైనా ఓదార్పు విజయం సాధించాలని టీమిండియా భావిస్తోంది. ఆస్ట్రేలియాతో 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌కు ముందు విజయంతో ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోవాలని చూస్తోంది.

Team India
Harshit Rana
India vs New Zealand
Cricket
  • Loading...

More Telugu News