Vijay: తమిళ హీరో విజయ్ కి కంగ్రాట్స్ చెప్పిన పవన్ కల్యాణ్

Pawan Kalyan Congrats Tamil hero Vijay on his political journey begining
  • గత ఫిబ్రవరిలో రాజకీయ పార్టీ ప్రకటించిన విజయ్
  • నిన్న విక్రవండి సభతో రాజకీయ సమరశంఖం పూరించిన వైనం
  • శత్రువు ఎవరు, మిత్రులు ఎవరో చెప్పిన దళపతి
  • సోషల్ మీడియాలో స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం
తమిళ స్టార్ హీరో విజయ్ నిన్న రాజకీయ సమరశంఖం పూరించిన సంగతి తెలిసిందే. గత ఫిబ్రవరిలో తన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగమ్ (టీవీకే)ను ప్రకటించిన విజయ్... నిన్న విల్లుపురం జిల్లా విక్రవండిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని తన రాజకీయ పంథాను చాటారు. 

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పారు. బీజేపీతో సిద్ధాంతపరంగా విభేదిస్తామని, డీఎంకేను రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తామని తమ పార్టీ వైఖరిని స్పష్టం చేశారు. తమకు మద్దతు ఇచ్చే పార్టీలతో కలిసి నడుస్తామని చెబుతూ, పొత్తులకు తాము వ్యతిరేకం కాదన్న సంకేతాలను పంపించారు. 

ఈ నేపథ్యంలో, విజయ్ రాజకీయ ప్రస్థానంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. "సాధువులు, సిద్ధులకు నెలవైన తమిళనాడులో తన రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టిన శ్రీ విజయ్ గారికి నా హృదయపూర్వక శుభాభినందనలు" అంటూ విషెస్ తెలియజేశారు. 

గతంలో పవన్ కల్యాణ్ సైతం ఇదే రీతిలో సినీ రంగం నుంచి వచ్చి పార్టీ పెట్టి, ప్రస్తుతం ఏపీ కూటమి ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా ఎదిగారు. అయితే, తమిళనాడు రాజకీయాలు విలక్షణమైనవి. కమల్ హాసన్ స్థాపించిన ఎంఎన్ఎం పార్టీ ఎన్నోఏళ్లుగా తమిళ రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఎలాంటి ప్రభావం చూపలేకపోతోంది. కనీసం ఉనికిని కూడా చాటుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలో, విజయ్ రాజకీయ ప్రస్థానం ఎలా సాగుతుందన్నది ఆసక్తి కలిగిస్తోంది.
Vijay
TVK Party
Pawan Kalyan
Tamil Nadu

More Telugu News