Hero Vijay: బీజేపీ మా సైద్ధాంతిక విరోధి... డీఎంకే మా రాజకీయ ప్రత్యర్థి: హీరో విజయ్ తొలి రాజకీయ ప్రసంగం

Hero Vijay first political speech focuses on many issues
  • రాజకీయ పార్టీ స్థాపించిన తమిళ హీరో విజయ్
  • నేడు విల్లుపురం జిల్లాలో భారీ బహిరంగ సభ
  • సమాజాన్ని విచ్ఛిన్నం చేసేవాళ్లే తమకు మొదటి శత్రువులన్న విజయ్
  • డీఎంకేపై పరోక్ష విమర్శలు
  • వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటన
తమిళ స్టార్ హీరో విజయ్ తమిళ వెట్రి కళగమ్ (టీవీకే) పేరిట రాజకీయ పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. ఇవాళ టీవీకే పార్టీ భారీ రాజకీయ బహిరంగ సభ నిర్వహించింది. విల్లుపురం జిల్లా విక్రవండి వద్ద ఏర్పాటు చేసిన ఈ సభకు లక్షలాదిగా విజయ్ అభిమానులు, ప్రజలు తరలివచ్చారు. 

ఈ సందర్భంగా విజయ్ తొలి రాజకీయ ప్రసంగం ఆసక్తికరంగా సాగింది. బీజేపీతో తాము సిద్ధాంతపరంగా విభేదిస్తామని, డీఎంకే పార్టీని రాజకీయంగా వ్యతిరేకిస్తామని చెబుతూ విజయ్ తమ పార్టీ వైఖరిని స్పష్టం చేశారు. సమాజంలో చీలికలు తీసుకువచ్చేందుకు ఓ గ్రూప్ ప్రయత్నిస్తోందని, సమాజాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించేవాళ్లు తమకు మొదటి శత్రువులని విజయ్ ఉద్ఘాటించారు. 

ద్రవిడ భావజాల పరిరక్షకులమని చెప్పుకుంటూ, తమిళనాడును కుటుంబ వ్యాపార సంస్థలా మార్చేసి దోపిడీకి పాల్పడుతున్న వాళ్లు తమ తదుపరి శత్రువులని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ద్రవిడ స్ఫూర్తిప్రదాత పెరియార్, మాజీ సీఎం కామరాజ్, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, రాణి వేలు నచ్చియార్, అంజలి అమ్మాళ్ ల అడుగుజాడల్లో నడుస్తామని విజయ్ ఈ సభలో ప్రతిజ్ఞ చేశారు. 

సర్దుబాటు రాజకీయాలకు, రాజీ ధోరణులకు తాము పూర్తి వ్యతిరేకమని స్పష్టం చేశారు. తమిళనాడు రాజకీయ ముఖచిత్రానికి గుణాత్మక మార్పు అవసరమని అభిప్రాయపడ్డారు. తాను వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాజకీయాల్లోకి రాలేదని, సామాజిక నిబద్ధతతో రాజకీయాల్లో అడుగుపెట్టానని తన బాణీ వినిపించారు. నేను రాజకీయాలకు కొత్తవాడ్ని కావొచ్చు... కానీ నా చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరు... రాజకీయాలు అంటే నాకు భయంలేదు అని విజయ్ స్పష్టం చేశారు. 

తమ పార్టీకి ప్రధాన శత్రువులు అవినీతి, మతోన్మాదం అని ఉద్ఘాటించారు. ద్రవిడ ముసుగులో డీఎంకే ప్రజలను మభ్యపెడుతోందని, డీఎంకే ప్రభుత్వం ప్రజావ్యతిరేకి అని విమర్శించారు. 

ఇక, తమ టీవీకే పార్టీ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 234 స్థానాల్లోనూ పోటీ చేస్తుందని విజయ్ ఈ సభలో ప్రకటించారు. తమతో కలిసి వచ్చే పార్టీలకు ఆహ్వానం పలుకుతామని వెల్లడించారు. ఇతర పార్టీలతో అధికారం పంచుకోవడానికి తమకెలాంటి అభ్యంతరం లేదని అన్నారు.

ఏ ఇతర రాజకీయ పార్టీకి ముసుగు పార్టీలా టీవీకే వ్యవహరించబోదని విజయ్ తేల్చిచెప్పారు. విజయమే టీవీకే పార్టీ లక్ష్యమని, ప్రత్యక్ష రాజకీయాల నుంచి వెనుదిరిగే ప్రసక్తే లేదని అన్నారు. 

విజయ్ తన రాజకీయ పార్టీని ఈ ఏడాది ఫిబ్రవరి 2న అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 22న తమ టీవీకే పార్టీ జెండా, సింబల్ ను ఆవిష్కరించారు.
Hero Vijay
TVK
Political Party
Tamil Nadu

More Telugu News