AP High Court: జర్నలిస్ట్ హత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే

ap high court reserves judgement on dadisetti raja Plea
  • 2019లో జరిగిన హత్య కేసులో దాడిశెట్టి రాజా ముందస్తు బెయిల్ పిటిషన్
  • హైకోర్టులో ముగిసిన ఇరుపక్షాల వాదనలు
  • తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు .. నవంబర్ 5న ఉత్తర్వులు ఇస్తామన్న న్యాయమూర్తి  
ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ కాతా సత్యనారాయణ హత్య కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా) దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో శనివారం వాదనలు ముగిశాయి. ఈ కేసులో నవంబర్ 5న ఉత్తర్వులు ఇస్తామని న్యాయమూర్తి జస్టిస్ విఆర్కే కృపాసాగర్ తెలిపారు. 2019 అక్టోబర్‌లో తుని, తొండంగిలలో విలేకరిగా పనిచేస్తున్న సత్యనారాయణ ద్విచక్రవాహనంపై వెళ్తుండగా పలువురు కత్తులతో దాడి చేయడంతో మృతి చెందాడు.

ఈ ఘటనకు సంబంధించి సత్యనారాయణ బంధువుల ఫిర్యాదు మేరకు అప్పటి వైసీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, మరి కొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం పోలీసులు నాటి ఎమ్మెల్యే రాజా పేరును తొలగించి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో కేసులో ముందస్తు బెయిల్ కోసం దాడిశెట్టి రాజా హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తరపున సీనియర్ న్యాయవాది మనోహర్‌రెడ్డి వాదనలు వినిపించారు. 

ఎఫ్ఐఆర్‌లో పిటిషనర్ పేరు ఉన్నప్పటికీ చార్జిషీటులో లేదని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం మారిన తర్వాత రాజాను కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని, అరెస్టు చేస్తారన్న ఆందోళన ఉందని, కాబట్టి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. 

మరోవైపు, సత్యనారాయణ సోదరుడు గోపాలకృష్ణ తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వరరావు వాదనలు వినిపించారు. కేసు దర్యాప్తు లోపభూయిష్టంగా ఉందని, ముందస్తు బెయిల్‌ను పిటిషనర్ కోరడానికి వీల్లేదని, ముందస్తు బెయిల్ పొందడానికి సహేతుక కారణాలు లేవని వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు. నవంబర్ 5వ తేదీన ఉత్తర్వులు ఇస్తామని ప్రకటించారు.
AP High Court
Dadisetti Raja
YSRCP

More Telugu News