Manda Krishna Madiga: చంద్రబాబుకు మంద కృష్ణ మాదిగ ప్రశంసలు... రేవంత్ రెడ్డిపై విమర్శలు

Chandrababu is better than Revanth Reddy says Manda Krishna Madiga
  • పెన్షన్ దారులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని విమర్శ
  • చంద్రబాబు అధికారంలోకి రాగానే పెన్షన్ పెంచారని వెల్లడి
  • 10 నెలలు దాటినా రేవంత్ ప్రభుత్వం పెంచలేదని ఆగ్రహం
రేవంత్ రెడ్డి కంటే చంద్రబాబు ఎంతో నయమని ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ అన్నారు. పెన్షన్ దారులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... చేయూత పెన్షన్ తీసుకునే వారిని నట్టేట ముంచారని, వారి కోసం ఎమ్మార్పీఎస్ పోరాటం చేస్తుందన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారని, కానీ అధికారంలోకి వచ్చి పది నెలలు దాటినా పెన్షన్ పెంచి ఇవ్వలేదని మండిపడ్డారు.

దివ్యాంగులకు పెన్షన్ పెంచి ఇవ్వాలని తాము చంద్రబాబుకు ఏప్రిల్ నెలలో వినతిపత్రం ఇస్తే, జూన్ నెలలో ఆయన అధికారంలోకి రాగానే అమలు చేశారన్నారు. కండరాల క్షీణత ఉంటే ఏపీలో రూ.15 వేలు ఇస్తున్నారని గుర్తు చేశారు. కానీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి 10 నెలలు దాటినా పెన్షన్ పెంచలేదన్నారు. పెన్షన్‌ను వెంటనే పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

నవంబర్ 1 నుంచి 16 రోజుల పాటు పెన్షన్ దారుల చైతన్య సభలు నిర్వహిస్తామని, అప్పటికీ ప్రభుత్వం ఇవ్వకుంటే నవంబర్ 26న ఛలో హైదరాబాద్‌కు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఇందిరా పార్క్ వద్ద వికలాంగుల మహాగర్జన నిర్వహిస్తామని, కాంగ్రెస్ తప్ప మిగతా పార్టీలన్నింటిని ఆహ్వానిస్తామన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామన్నారు.
Manda Krishna Madiga
MRPS
Telangana
Andhra Pradesh

More Telugu News