Pawan Kalyan: సరస్వతి పవర్ భూములపై అధికారులతో మాట్లాడిన పవన్ కల్యాణ్

deputy cm pawan asked for a report on saraswati power lands
  • పల్నాడు జిల్లా దాచేపల్లి, మాచవరం మండలాల్లో వైఎస్ జగన్‌కు చెందిన సరస్వతి పవర్ సంస్థకు 1515.93 ఎకరాల భూమి
  • ఆ సంస్థలో అటవీ భూములపై డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ ఆరా
  • అటవీ భూముల విస్తీర్ణం, పర్యావరణ అనుమతులపై వివరాలతో నివేదిక ఇవ్వాలని ఆదేశించిన పవన్ కల్యాణ్
ఏపీలో ప్రస్తుతం వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్, ఆయన సోదరి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు మధ్య ఆస్తుల వివాదం హాట్ టాపిక్‌గా ఉంది. వైఎస్ఆర్ కుటుంబ ఆస్తుల పంపిణీ అంశానికి సంబంధించి విమర్శలు, ప్రతి విమర్శలతో మాటల యుద్ధం జరుగుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.  

పల్నాడు జిల్లా దాచేపల్లి, మాచవరం మండలాల్లో సరస్వతి పవర్ సంస్థకు చెందిన 1515.93 ఎకరాల్లో ప్రకృతి సంపద, వాగులు, వంకలు, కొండ భూములు ఉన్నాయనే వార్తలు వెలుగులోకి రావడం జరిగింది. దీంతో అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగానూ ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దీనిపై స్పందించారు. సరస్వతి పవర్ సంస్థకు చెందిన భూముల్లో ఎంత విస్తీర్ణంలో అటవీ భూములు ఉన్నాయనే దానిపై వివరాలతో నివేదిక ఇవ్వాలని అటవీ శాఖ అధికారులను, పల్నాడు జిల్లా యంత్రాంగాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఈ అంశంపై అధికారులతో పవన్ చర్చించారు. 

ఆ సంస్థకు చెందిన భూముల్లో ప్రభుత్వ భూములు, జల వనరులు, అటవీ భూములు ఏ మేరకు ఉన్నాయో సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని అధికారులకు పవన్ స్పష్టం చేశారు. ఆ సంస్థ భూముల్లో వాగులు, వంకలు, కొండలు ఉన్నందున పర్యావరణ అనుమతులు ఏ విధంగా పొందారో కూడా తెలియజేయాలని పీసీబీని పవన్ ఆదేశించారు.  ఈ అంశంపై అటవీ, రెవెన్యూ, పీసీబీ ఉన్నతాధికారులతో త్వరలో డిప్యూటీ సీఎం సమీక్షించనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
Pawan Kalyan
YS Jagan
YS Sharmila
Farest Lands
saraswati power lands

More Telugu News