Kanguva: నా సినిమా చూసి ఒకరు ఐపీఎస్‌ ఆఫీసర్‌ అయ్యారు! : హీరో సూర్య

Someone became an IPS officer after watching my film Hero Surya
  • కంగువ ప్రమోషన్స్‌ కోసం హైదరాబాద్‌ వచ్చిన సూర్య 
  • అభిమానులతో ఇంటరాక్ట్‌ అవుతూ భావోద్వేగానికి గురైన సూర్య 
  • పీరియాడిక్‌ యాక్షన్‌ ఫిల్మ్‌గా ప్రేక్షకుల ముందుకు కంగువ
''నటుడిగా కమల్ హాసన్‌ను  చూసి ప్రేరణ పొందుతుంటాను. మంచి సినిమాలు సమాజంలో ఎంతో మార్పు తీసుకొస్తాయి. నేను నటించిన కాక్క కాక్క సినిమా చూసి ఒకరు ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు. జైభీమ్ సినిమా తర్వాత తమిళనాడులో 3 లక్షల మందికి ఇంటి పట్టాలు వచ్చాయి. ఇలాంటివి మనసుకు ఎంతో సంతోషానిస్తాయి" అని తమిళ నటుడు సూర్య అన్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'కంగువ'. నవంబరు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. పీరియాడిక్ యాక్షన్‌ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి శివ దర్శకుడు. దిశా పటాని కథానాయిక. 

ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా సూర్య గురువారం నాడు హైదరాబాద్‌కు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులను ఉద్దేశించి భావోద్వేగ ప్రసంగం చేశారు. ఆయన మాట్లాడుతూ "మీ ప్రేమను చూస్తుంటే నా కళ్లు చెమ్మగిల్లుతున్నాయి. నాపై మీరు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతగా మీకోసం, మీకు ఓ మంచి సినిమా అనుభూతిని ఇవ్వాలనే లక్ష్యంతో చేసిన సినిమా కంగువ. ఇలాంటి సినిమాలు చేసేందుకు దర్శకుడు రాజమౌళి గారు స్ఫూర్తినిచ్చారు. ఇది ఒక పైటర్ సినిమా కాదు ఒక వారియర్ మూవీ. తన వాళ్ల కోసం, తను నమ్మిన ధర్మం కోసం పోరాడే వారియర్ మూవీ. 

బాలకృష్ణ గారి అన్ స్టాపబుల్ షోలో ఈ రోజు పాల్గొన్నాను. ఆయనతో ఆ షో చేయడం మర్చిపోలేని ఎక్స్‌పీరియన్స్‌.  ఆయన క్రమశిక్షణ, కష్టపడే తత్వం, అంకితభావం  చూశాక అందుకే అంత గొప్ప స్థాయికి వెళ్లారనిపించింది" అన్నారు. 

దర్శకుడు శివ మాట్లాడుతూ "వెయ్యేళ్ల క్రితం ఆది మానవుల టైమ్‌ నుంచి ఐదు తెగల మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో ఈ కథ ఉంటుంది. ట్రైలర్‌ అందరికి ఎంత నచ్చిందో, రేపు సినిమా కూడా దానికి మించిన విధంగా నచ్చుతుంది. రాజమౌళి స్పూర్తితో ఈ సినిమా చేశాను. ఆయన విక్రమార్కుడు చిత్రాన్ని నేను తమిళంలో 'సిరుతై' పేరుతో రీమేక్‌ చేశాను. ఆ సినిమా నాకు సక్సెస్‌ ఇవ్వడంతో పాటు నా ఇంటి పేరు ముందు సిరుతై చేరింది. తప్పకుండా ఈ చిత్రం మీ అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉంది" అన్నారు.  


Kanguva
Surya
Suriya
Director siva
KE Gnanavel Raja
Studio Green
Kanguva release date
Cinema

More Telugu News