Deepawali: దీపావళి బాణసంచా విక్రయించేవారు ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి: జీహెచ్ఎంసీ కమిషనర్

GHCM commissioner says Trade Licence must and should for Deepavali
  • రిటైల్ దుకాణాలు రూ.11 వేలు, హోల్‌సేల్ దుకాణాలు రూ.66 వేలు చెల్లించాలన్న కమిషనర్
  • ఫుట్‌పాత్‌లు, జనావాసాల మధ్య బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేయవద్దన్న కమిషనర్
  • కాలనీలు, బస్తీలకు దూరంగా దుకాణాలు ఏర్పాటు చేయాలన్న కమిషనర్
దీపావళికి బాణసంచా విక్రయించే దుకాణదారులు తప్పకుండా ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ... హైదరాబాద్ నగరంలో క్రాకర్స్ దుకాణాలు పెట్టేవారు లైసెన్స్ తీసుకోవాలన్నారు. రిటైల్ దుకాణాలకు రూ.11 వేలు, హోల్‌సేల్ దుకాణాలకు రూ.66 వేలు లైసెన్స్ ఫీజును నిర్ణయించినట్లు తెలిపారు. ఫుట్‌పాత్‌లు, జనావాసాల మధ్య బాణసంచా దుకాణాలను ఏర్పాటు చేయవద్దని సూచించారు.

దుకాణాలు ఏర్పాటు చేసుకునేవారు నిర్ణీత ఫీజును చెల్లించి జీహెచ్ఎంసీ నుంచి ముందస్తు అనుమతి పొందాలన్నారు. తాత్కాలిక ట్రేడ్ ఐడెంటిఫికేషన్ నెంబర్ కోసం సిటిజన్ సర్వీస్ సెంటర్, జీహెచ్ఎంసీ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వులను పాటించాలని స్పష్టం చేశారు. నిబంధనలు పాటించకుంటే తాత్కాలిక ట్రేడ్ లైసెన్స్‌ను రద్దు చేస్తామని హెచ్చరించారు.

బాణసంచా స్టాల్స్‌కు ఏర్పాటు చేసే విద్యుత్‌కు సంబంధించి నాణ్యమైన పరికరాలు ఉపయోగించాలన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరిగితే అందుకు దుకాణాల యజమానులే బాధ్యత వహించాలన్నారు. కాలనీలు, బస్తీలకు దూరంగా దుకాణాలు ఏర్పాటు చేయాలన్నారు. పెద్ద పెద్ద హాల్స్‌లో తగిన ఫైర్ సేఫ్టీతో దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.
Deepawali
Crackers
Telangana
Hyderabad

More Telugu News