Jogulamba Gadwal: హృదయవిదారక ఘటన.. ఓవైపు భర్త మరణం, మరోవైపు కుమారుడి జననం!

Very Sad Incident in Jogulamba Gadwal District
  • జోగులాంబ గద్వాల జిల్లాలో ఘటన
  • ఒకే ఆసుపత్రిలో అటు భర్త మరణం.. ఇటు పుత్రుడి జననం
  • తండ్రి మృతి చెందిన గంటకు కుమారుడి జననం
తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ఆమె భర్త మృతి చెందిన గంటకు కుమారుడు జ‌న్మించాడు. భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన‌ ఒక గంట వ్యవధిలోనే అతడి భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఓవైపు తండ్రి మరణం మరోవైపు పుత్రుడి జననం.. ఇలా ఆ కుటుంబంతో విధి వింత నాటక‌మే ఆడింది.

ఘ‌ట‌న పూర్తి వివ‌రాల్లోకి వెళితే.. జోగులాంబ గద్వాల జిల్లా మండల కేంద్రం రాజోలికి చెందిన‌ శివ (26) కు ఏపీలోని ఉమ్మడి కర్నూలు జిల్లా బనగానపల్లెకు చెందిన లక్ష్మితో 14 నెలల కిందట వివాహమైంది. ఆమె గర్భం దాల్చ‌డంతో కాన్పు కోసం పుట్టింటికి వెళ్లింది. పెట్రోలుబంకులో పనిచేసే శివ‌ మంగళవారం సాయంత్రం రాజోలిలో ద్విచక్రవాహనంపై వెళ్తుండగా రోడ్డు ప్ర‌మాదానికి గుర‌య్యాడు. అత‌డు వెళ్తున్న బైక్ ఎస్సీ కాలనీ వద్ద అదుపు తప్పడంతో కింద‌ పడిపోయాడు.

ఈ ప్ర‌మాదంలో అత‌ని తలకు తీవ్ర గాయాల‌య్యాయి. దాంతో శివ‌ను కుటుంబ స‌భ్యులు రాత్రి 8 గంటల స‌మ‌యంలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సరిగ్గా మంగళవారం రాత్రే లక్ష్మికి పురిటినొప్పులు రావ‌డంతో ఆమెను రాత్రి 10 గంటలకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేర్పించారు. 

ఈ క్ర‌మంలో బుధవారం తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో పరిస్థితి విషమించడంతో శివ చ‌నిపోయాడు. కానీ, అదే ఆసుప‌త్రిలో ఉన్న‌ లక్ష్మికి కుటుంబ స‌భ్యులు ఈ విష‌యం చెప్ప‌లేదు. ఆ త‌ర్వాత వైద్యులు ఆమెకు సిజేరియన్ చేయగా మగబిడ్డ పుట్టాడు. తండ్రి చ‌నిపోయిన సుమారు గంటకు ఆ పసివాడు కళ్లు తెరిచాడు. మ‌గ‌బిడ్డ పుట్టిన ఆనందాన్ని అనుభవించకుండానే శివ మృతిచెంద‌డంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. 
Jogulamba Gadwal
Telangana

More Telugu News