Hyderabad Cabbie Warns: నో రొమాన్స్‌... జంట‌ల‌కు హైద‌రాబాద్ క్యాబ్ డ్రైవ‌ర్ వార్నింగ్... నెట్టింట‌ వైర‌ల్ అవుతున్న నోట్‌!

No Romance Hyderabad Cabbie Warns Couples To Stay Calm and Maintain Distance
  • ప్రయాణికులు కుదురుగా ఉండాల‌న్న క్యాబ్ డ్రైవ‌ర్‌
  • ఒకరికొకరు ఎడంగా ఉండాలని సూచ‌న‌
  • ఇది మీ ప్రైవేట్ స్థలం కాదు.. కాబట్టి నో రొమాన్స్ అంటూ నోట్‌
గత వారం బెంగళూరు క్యాబ్ డ్రైవర్ తాలూకు ఆరు రూల్స్‌తో కూడిన ఒక బోర్డు నెట్టింట బాగా వైర‌ల్ అయిన విష‌యం తెలిసిందే. సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడిట్‌లో పోస్ట‌యిన ఆ బోర్డు సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఇదే కోవ‌లో హైద‌రాబాద్ క్యాబ్ డ్రైవ‌ర్ కు సంబంధించిన వార్నింగ్ నోట్‌ కూడా బాగా వైర‌ల్ అవుతోంది. 

త‌న క్యాబ్ ఎక్కే ప్ర‌యాణికుల‌కు వార్నింగ్ ఇవ్వ‌డం ఆ నోట్‌లో ఉంది. ముఖ్యంగా జంట‌ల‌ను ఉద్దేశించి దాన్ని ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. ఆ నోట్‌లో డ్రైవర్... క్యాబ్ ఎక్కిన తర్వాత ప్రయాణికులు కుదురుగా కూర్చోవాలని, ఒకరికొకరు ఎడంగా ఉండాలని చెప్ప‌డం మ‌నం చూడొచ్చు. 

ప్రత్యేకంగా జంటలను ఉద్దేశించి అందులో సందేశం ఉంది. "వార్నింగ్‌... నో రొమాన్స్‌. ఇది క్యాబ్, మీ ప్రైవేట్ స్థలం కాదు. కాబట్టి దయచేసి దూరం పాటించండి. ప్రశాంతంగా ఉండండి" అని ఆ నోట్‌లో రాసి ఉంది. 

ఈ నోట్‌ను మొదట 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌)లో వెంకటేశ్ అనే యూజ‌ర్‌ పోస్ట్ చేశారు. ఆ త‌ర్వాత‌ 'హాయ్ హైదరాబాద్' అనే ఎక్స్ ఖాతా ద్వారా మళ్లీ పోస్ట్ అయింది. ఇప్పుడిది నెట్టింట‌ నవ్వులు పూయిస్తోంది. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు. 

"ఇది క్యాబ్ ప్రయాణికులకు నైతికపరంగా అవసరమైన సందేశం" అని ఒకరు కామెంట్ చేస్తే, మరొకరు "అరె.. వీటిని బెంగళూరు, ఢిల్లీలో చూశాను. హైదరాబాద్‌లో ఇంత త్వరగా ఊహించలేదు" అని వ్యాఖ్యానించారు.
Hyderabad Cabbie Warns
No Romance
Hyderabad

More Telugu News