Cheteshwar Pujara: బ్రియాన్ లారాను వెన‌క్కి నెట్టిన‌ ఛ‌టేశ్వర్ పుజారా

Cheteshwar Pujara overtakes Brian Lara in list of First Class hundreds
  • 66వ ఫస్ట్‌క్లాస్ సెంచరీ న‌మోదు చేసిన పుజారా
  • ఛత్తీస్‌గఢ్‌తో రంజీ ట్రోఫీ రౌండ్ 2 మ్యాచ్‌లో శ‌త‌కం బాదిన స్టార్ క్రికెట‌ర్‌
  • అత్యధిక ఫస్ట్‌క్లాస్ సెంచరీల జాబితాలో లారాను అధిగ‌మించిన పుజారా
టీమిండియా క్రికెటర్ ఛ‌టేశ్వర్ పుజారా ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అరుదైన ఘ‌న‌త సాధించాడు. తాజాగా 66వ సెంచరీ న‌మోదు చేశాడు. ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న‌ రంజీ ట్రోఫీ రౌండ్ 2 మ్యాచ్‌లో పుజారా శ‌త‌కం బాదాడు. దీంతో రెడ్ బాల్ క్రికెట్‌లో పుజారా మ‌రోసారి ఎంత విలువైన ఆట‌గాడో నిరూపించాడు.

ఇక ఈ సెంచరీతో పుజారా అత్యధిక ఫస్ట్‌క్లాస్ సెంచరీల జాబితాలో లెజెండరీ మాజీ క్రికెట‌ర్‌ బ్రియాన్ లారాను వెన‌క్కి నెట్టాడు. అలాగే 21 వేల‌ పరుగుల మైలురాయిని కూడా చేరుకున్నాడు.

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో 1988 జనవరి 25న జన్మించిన పుజారా క్రికెట్ కుటుంబంలోనే పెరిగాడు. అతని తండ్రి అరవింద్ పుజారా, మామ బిపిన్ పుజారా ఇద్దరూ రంజీ ట్రోఫీలో సౌరాష్ట్రకు ప్రాతినిధ్యం వ‌హించారు. ఇక‌ పుజారా 2005 డిసెంబరులో సౌరాష్ట్ర తరపున ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. అప్పటి నుండి అదే జట్టుకు ఆడుతూ కీల‌క ప్లేయ‌ర్‌గా మారాడు. 

పుజారా దేశవాళీ కెరీర్ కూడా ఘ‌నంగానే ఉంది. అతను రంజీ ట్రోఫీ 2017-18 సీజన్ తో సహా పలు సందర్భాలలో సౌరాష్ట్ర తరపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. త‌న‌దైన ఆట‌తో సౌరాష్ట్ర టీమ్ దేశవాళీ క్రికెట్‌ లో విజయవంతం కావడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ క్ర‌మంలో 2019-20 రంజీ సీజ‌న్‌లో పుజారా తన 50వ ఫస్ట్‌క్లాస్  సెంచరీని సాధించాడు.

టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్‌గా పుజారా 

2010 అక్టోబరులో బెంగుళూరులో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ ద్వారా పుజారా అంతర్జాతీయ కెరీర్ ప్రారంభమైంది. అప్పటి నుండి ఎంతో క్రమశిక్షణతో కూడిన బ్యాటింగ్ శైలితో భారత టెస్ట్ జట్టులో కీల‌క ఆట‌గాడిగా మారాడు. చాలా కాలంపాటు జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించాడు.

100 టెస్టు మ్యాచ్‌లు ఆడిన పుజారా 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు బాదాడు. 43.60 సగటుతో 7,195 పరుగులు చేశాడు. 2018-19 సీజన్ లో ఆస్ట్రేలియా పర్యటన సంద‌ర్భంగా టీమిండియా చారిత్రాత్మక టెస్ట్ సిరీస్ విజయం సాధించ‌డంలో పుజారాదే కీరోల్‌. రాంచీలో జరిగిన మూడో టెస్టులో వృద్ధిమాన్ సాహాతో కలిసి 199 పరుగుల భాగస్వామ్యాన్ని నెల‌కొల్పిన‌ పుజారా... మూడో డబుల్ సెంచరీ న‌మోదు చేయ‌డం ఆ సిరీస్‌లో ఒక హైలైట్‌గా నిలిచింది. 

కౌంటీ క్రికెట్‌లోనూ పుజారా మార్క్‌

దేశ‌వాళీ, అంతర్జాతీయ క్రికెట్‌లో త‌న‌దైన ఆట‌తో విశేషంగా ఆక‌ట్టుకున్న‌ పుజారా కౌంటీ క్రికెట్‌లో కూడా రాణించాడు. యూకేలో జరిగే కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ససెక్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అక్క‌డ కూడా ఎన్నో అద్భుత‌మైన ఇన్నింగ్స్‌ల‌తో త‌న మార్క్‌ను చూపించాడు.
Cheteshwar Pujara
Brian Lara
First Class Hundreds
Cricket
Sports News

More Telugu News