Viral News: బర్త్‌డే బాయ్‌కి గిఫ్ట్‌గా క్రికెట్ కిట్ అందించిన కుటుంబ సభ్యులు.. బాలుడి రియాక్షన్ వైరల్‌

A video of a young boys birthday wish coming true went viral on Social Media
  • ఆశ్చర్యపోయి అమితానందపడ్డ బాలుడు
  • తండ్రిని, అక్కను ఆప్యాయంగా హత్తుకున్న బర్త్‌డే బాయ్
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
మన దేశంలో క్రికెట్‌కు ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. చిన్నవయసు నుంచే చాలామంది క్రికెట్‌పై అభిమానాన్ని పెంచుకుంటున్నారు. మంచి క్రికెట్ కిట్ ఉండాలని కోరుకునే ఔత్సాహిక పిల్లలు దేశంలో లెక్కలేనంత మంది ఉన్నారు. మరి క్రికెట్‌ను అమితంగా ఇష్టపడే పిల్లలకు క్రికెట్ కిట్‌ను అందిస్తే వాళ్లు ఎంత సంతోషిస్తారో తెలియజేసే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఒక బాలుడికి అతడి కుటుంబ సభ్యులు బర్త్‌డే గిఫ్ట్‌గా ఒక క్రికెట్ కిట్‌ అందించారు. క్రికెట్ కిట్‌పై ఒక వస్త్రాన్ని కప్పి ఉంచి వెళ్లి చూడాలని బాలుడిని కోరారు. అతడు వెళ్లి వస్త్రాన్ని తొలగించి క్రికెట్ కిట్‌ను చూసి ఆశ్చర్యపోయాడు. ఆ క్షణంలో బాలుడి ఆనందాన్ని ఇంట్లో వాళ్లు అదుపు చేయలేకపోయారు. అతడి ముఖం ఆనందంతో వెలిగిపోయింది. ఉత్సాహంతో అటు ఇటు గంతులు వేశాడు. పట్టరాని ఆనందంతో తన అక్కను ఆప్యాయంగా హత్తుకున్నాడు. అంతలోనే భావోద్వేగానికి గురై కన్నీళ్లు చెమర్చాడు. తన వెనకాలే ఉన్న తండ్రిని కూడా హత్తుకున్నాడు.

హృదయాన్ని హత్తుకునేలా ఉన్న ఈ వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. వెలకట్టలేని క్షణాలు, అద్భుతమైన బహుమతి ఇచ్చారంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. బాలుడు ప్రతిస్పందన స్వచ్ఛమైనదని వ్యాఖ్యానిస్తున్నారు. కిట్‌ను కూడా తాకకుండానే నేరుగా వారిని కౌగిలించుకోవడానికి వెళ్లడం చూస్తుంటే బాలుడు ఎంత కృతజ్ఞతా భావంతో ఉన్నాడో అర్థమవుతోందని పలువురు పేర్కొన్నారు. తండ్రిని బాలుడు కౌగిలించుకున్నప్పుడు తనకు కూడా కన్నీళ్లు వచ్చాయని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. కాగా ఈ వీడియోకు ఇప్పటికే 5 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.
Viral News
Viral Videos
Off beat News

More Telugu News