Pawan Kalyan: నేను ఆరాధించే గొప్ప నాయ‌కుడు ఎంజీఆర్: డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్

AP Deputy CM Pawan Kalyan Special Tweet on AIADMK 53rd Anniversary
  • నేడు అన్నాడీఎంకే 53వ వార్షికోత్సవం 
  • ఈ సందర్భంగా 'ఎక్స్' వేదిక‌గా పార్టీ శ్రేణుల‌కు ప‌వ‌న్ శుభాకాంక్ష‌లు
  • మ‌రోసారి ఎంజీఆర్‌పై త‌న అభిమానాన్ని చాటుకున్న జ‌న‌సేనాని 
  • ఎంజీఆర్‌ పేదల అభ్యున్నతికి కట్టుబడ్డ మ‌హానేత అంటూ ప‌వ‌న్ ప్ర‌శంస‌
నేడు అన్నాడీఎంకే 53వ వార్షికోత్సవం సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఆ పార్టీ నాయ‌క‌త్వానికి, స‌భ్యుల‌కు, ఎంజీఆర్ అభిమానుల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఈ సంద‌ర్భంగా పార్టీ వ్య‌వ‌స్థాప‌కులు, ప్ర‌ముఖ న‌టుడు ఎంజీఆర్‌పై జ‌న‌సేనాని మ‌రోసారి త‌న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ ప్ర‌త్యేకంగా చేసిన ట్వీట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాల వైర‌ల్ అవుతోంది.

"ఏఐఏడీఎంకే పార్టీ నాయకత్వానికి, సభ్యులకు, మద్దతుదారులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అక్టోబరు 17, 1972న 'పురట్చి తలైవర్' తిరు ఎంజీ రామచంద్రన్ ద్వారా పార్టీ స్థాపించబడింది. తమిళనాడులో అన్నాడీఎంకే శరవేగంగా బలీయమైన రాజకీయ శక్తిగా అవతరించింది. 

నేను అత్యంత గౌరవంగా భావించే నాయకుడు ఎంజీఆర్. పేదల అభ్యున్నతికి కట్టుబడి, ఎవరూ ఆకలితో ఉండకూడదని, ప్రతి వ్యక్తికి గౌరవంగా జీవించే హక్కు ఉందని భరోసా ఇచ్చిన మ‌హానీయుడు. ఎంజీఆర్‌ను అంద‌రీలో ప్రత్యేకంగా ఉంచేది ఆయ‌న‌ దూరదృష్టిగల పాలనే. అభివృద్ధితో సంక్షేమాన్ని సమతుల్యం చేయాలనే అతని నమ్మకం తమిళనాడును దేశంలోని అత్యంత సంపన్న రాష్ట్రాలలో ఒకటిగా మార్చింది. 

ఎంజీఆర్‌ నాయకత్వ ప్ర‌ధాన ల‌క్ష‌ణం కేవలం తక్షణ అవసరాలను తీర్చడం మాత్రమే కాదు, స్థిరమైన పురోగతికి బలమైన పునాది వేయడం. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి రెండింటికీ ఆయన నిబద్ధత శాశ్వత వారసత్వంగా మిగిలిపోయింది. ఇది వ్యక్తిగతంగా నాకు స్ఫూర్తినిస్తూనే ఉంది. అసాధారణమైన నాయకత్వంతో ఎంజీఆర్‌ దార్శనికతను ముందుకు తీసుకెళ్లిన 'పురట్చి తలైవి' జయలలిత ఈ వారసత్వాన్ని మరింత సుస్థిరం చేశారు. 

ఆమె పరిపాలన ఎంజీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే కాకుండా ప్రజలలో 'అమ్మ'గా శాశ్వతమైన గౌరవాన్ని పొందింది. పొరుగు రాష్ట్రాలతో సామరస్యపూర్వక సంబంధాలను పెంపొందించడంలో ఆమె చేసిన కృషి అభినంద‌నీయం. తెలుగు భాష పట్ల ఆమెకున్న గౌరవం ప్రశంసనీయం. 

తమిళనాడు ముఖ్యమంత్రిగా పురట్చి తలైవి సెల్వి జయలలిత మరణ సమయంలో, ఆ తర్వాత ఏఐఏడీఎంకే ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపించిన వారు ఆమె అడుగుజాడల్లో నిజాయితీగా నడుస్తున్నారు. జనసేన పార్టీ త‌ర‌ఫున‌ ఈ ముఖ్యమైన సందర్భంగా అన్నాడీఎంకేకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 

తమిళనాడు ప్రజలకు సేవ చేయడం, ఎంజీఆర్ ఆశయాలను నెరవేర్చడం, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం, రాష్ట్రాన్ని అభివృద్ధి, శ్రేయస్సు ఉన్నత శిఖరాల వైపు నడిపించడం వంటి వారసత్వాన్ని పార్టీ కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను. తమిళ భాష, సంస్కృతి పట్ల నాకు ప్ర‌త్యేక‌ గౌరవం ఉంది. తమిళుల అలుపెరగని పోరాట పటిమపై కూడా నాకు ఎప్పటినుంచో గౌరవం. ఈ సందర్భంగా తిరువళ్లువర్ ఆత్మ సిద్ధులు, సాధువులకు నా హృదయపూర్వక శుభాకాంక్ష‌లు" అని జ‌న‌సేనాని త‌న ట్వీట్‌లో రాసుకొచ్చారు.
Pawan Kalyan
AIADMK
MGR
Andhra Pradesh
Tamilnadu

More Telugu News