Supreme Court: ఉచితాల‌పై సుప్రీంకోర్టులో విచార‌ణ‌... కేంద్రం, ఎన్నిక‌ల క‌మిష‌న్‌ల‌కు నోటీసులు

Supreme Court Issues Notice on Freebies Plea Seek Response from Centre and Electio Commission
  • ఉచిత హామీల‌ను లంచాలుగా ప‌రిగ‌ణించాలంటూ బెంగ‌ళూరు న్యాయ‌వాది సుప్రీంకోర్టులో పిటిష‌న్‌
  • ఈ పిటిష‌న్‌పై సీజేఐ జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం విచార‌ణ
  • ఇదే అంశంపై పెండింగ్‌లో ఉన్న ప‌లు కేసుల‌ను కూడా విచారించాల‌ని న్యాయ‌స్థానం నిర్ణ‌యం
ఎన్నిక‌ల స‌మ‌యంలో చిన్న‌ పెద్ద అనే తేడా లేకుండా పార్టీల‌న్నీ వ‌రుస‌గా ఉచిత హామీలు గుప్పించ‌డం స‌ర్వ‌సాధార‌ణం అయిపోయింది. ఇదే విష‌య‌మై అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టులో ఇవాళ విచార‌ణ జ‌రిగింది. విచార‌ణ అనంత‌రం కోర్టు... ఎన్నిక‌ల క‌మిష‌న్‌తో పాటు కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. 

ఎన్నిక‌ల స‌మ‌యంలో రాజ‌కీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీల‌ను లంచాలుగా ప‌రిగ‌ణించాల‌ని కోరుతూ బెంగ‌ళూరుకు చెందిన న్యాయ‌వాది సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. ఈ సంద‌ర్భంగా రాజ‌కీయ పార్టీలు ఎన్నిక‌ల ముందు ఉచితాలు ఇస్తామ‌ని హామీ ఇవ్వ‌కుండా నిరోధించాల్సిందిగా పోల్ ప్యానెల్‌ను ఆదేశించాల‌ని పిటిష‌న్‌లో పేర్కొన్నారు. 

ఉచితాల వ‌ల్ల ప్ర‌భుత్వానికి అధిక భారంగా ప‌రిణ‌మిస్తుంద‌ని తెలిపారు. ఈ పిటిష‌న్‌పై సీజేఐ జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం విచార‌ణ జ‌రిపింది. అనంత‌రం కేంద్రంతో పాటు ఎన్నిక‌ల సంఘానికి నోటీసులు జారీ చేసింది. అలాగే ఇదే అంశంపై పెండింగ్‌లో ఉన్న ప‌లు కేసుల‌ను కూడా ఈ పిటిష‌న్‌తో క‌లిపి విచారించాల‌ని న్యాయ‌స్థానం నిర్ణ‌యించింది. 

ఇక ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చే ఉచిత వాగ్దానాలు ఓట‌ర్ల‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతున్న‌ట్లు పిటిష‌న‌ర్ త‌ర‌ఫు న్యాయ‌వాది పేర్కొన్నారు. ఉచిత హామీలు ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను కూడా దెబ్బ‌తీస్తున్నాయ‌ని తెలిపారు.
Supreme Court
Freebies
Election Commission
Notices

More Telugu News