IndiGo flights: మరో రెండు విమానాలు, ఒక రైలుకు బాంబు బెదిరింపులు`

Two IndiGo flights had received a bomb threat on Monday
  • నిబంధనల ప్రకారం రెండు విమానాల్లోనూ తనిఖీలు
  • ముంబై-హౌరా మెయిల్‌ను పేల్చివేస్తామంటూ బెదిరింపు సందేశం
  • తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువు దొరకలేదని వెల్లడి
ఎయిరిండియా విమానం తర్వాత ఇండిగోకు చెందిన మరో రెండు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ముంబై నుంచి మస్కట్‌కు, జెడ్డాకు వెళ్లాల్సిన ఫ్లైట్లకు బాంబు బెదిరింపులు వచ్చాయని దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగో ప్రతినిధి ఎక్స్ వేదికగా ప్రకటించారు. ‘‘ముంబై నుంచి మస్కట్‌కు వెళ్లాల్సిన ఇండిగో ఫ్లైట్ 6ఈ 1275కి బాంబు బెదిరింపు వచ్చింది. ప్రోటోకాల్ ప్రకారం విమానాన్ని దూరంగా ఉండే ఒక బే ప్రాంతానికి తీసుకెళ్లారు. నిర్వహణ విధానంలోని నిబంధనల ప్రకారం భద్రతా తనిఖీలు వెంటనే మొదలయ్యాయి’’ అని వివరించారు. మరో ముంబై నుంచి జెడ్డా వెళ్తున్న ఇండిగో ఫ్లైట్ 6ఈ 56కు కూడా బాంబు బెదిరింపు వచ్చిందని వెల్లడించారు.

కాగా సోమవారం ఉదయం ముంబై-న్యూయార్క్ వెళ్లాల్సిన విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో విమానాన్ని ఢిల్లీకి మళ్లించిన విషయం తెలిసిందే. 239 మంది ప్రయాణీకులు ఉన్న ఈ విమానాన్ని ఢిల్లీ విమానాశ్రయంలో భద్రంగా ల్యాండింగ్ చేశారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే రెండు ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు రావడం గమనార్హం.

రైలుకు బాంబు బెదిరింపు
విమానాల తరహాలోనే అంతకుముందు ముంబై-హౌరా మెయిల్‌ను పేల్చివేస్తామంటూ రైల్వే అధికారులకు బెదిరింపులు వచ్చాయి. టైమర్ బాంబుతో పేల్చివేస్తామని బెదిరించారు. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ బెదిరింపు సందేశం వచ్చింది. దీంతో 12809 ట్రైన్‌ను జల్గావ్ స్టేషన్‌లో ఆపివేశారు. భద్రతా తనిఖీలు చేపట్టారు. అయితే రైలులో ఎలాంటి అనుమానాస్పద వస్తువు లభ్యంకాలేదు. దీంతో రైలు గమ్యస్థానానికి బయలుదేరిందని సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు.
IndiGo flights
IndiGo
Air India

More Telugu News