Roshnabad Jail: హరిద్వార్‌ జైలులో 'రామ్‌లీలా' నాటకం.. వానరులుగా నటించి పరారైన ఇద్ద‌రు ఖైదీలు!

Two prisoners dressed as monkeys escape from Uttarakhand jail during Ramleela enactment
  • ద‌స‌రాను పురస్కరించుకుని జైలులో రామ్‌లీలా నాటకం ప్ర‌ద‌ర్శన‌
  • వాన‌రాల వేషధారణలో ఉన్న పంకజ్‌, రాజ్‌కుమార్ అనే ఇద్ద‌రు ఖైదీల ప‌రారీ
  • జైలు అధికారులు, సిబ్బంది, గార్డులంతా నాటకం చూడడంలో బిజీ
  • అదే అదునుగా భావించి జైలు గోడ దూకి ప‌రారైన ఖైదీలు
  • విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆరుగురు జైలు అధికారుల సస్పెన్షన్ 
విజయదశమిని పురస్కరించుకుని జైలులో ప్ర‌ద‌ర్శించిన‌ రామ్‌లీలా నాటకంలో భాగంగా వానరులుగా నటించిన ఇద్దరు ఖైదీలు నిచ్చెన సాయంతో గోడ దూకి పరారయ్యారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ పట్టణంలోని రోష్నాబాద్ జైలులో ఈ ఘటన చోటుచేసుకుంది. వాన‌రాల వేషధారణలో ఉన్న పంకజ్‌, రాజ్‌కుమార్ అనే ఇద్ద‌రు ఖైదీలు ఇలా త‌ప్పించుకున్నారు. దాంతో వారి కోసం ఉత్తరాఖండ్ పోలీసులు వెతుకుతున్నారు.  

నాటకం రసవత్తరంగా సాగుతుండడం, జైలు అధికారులు, సిబ్బంది, గార్డులంతా నాటకం చూడడంలో మునిగిపోవడంతో ఇదే అదునుగా భావించిన వానర వేషంలో ఉన్న ఇద్దరు ఖైదీలు నెమ్మదిగా అక్కడి నుంచి జారుకుని నిచ్చెన ద్వారా గోడ దూకి పరారయ్యారు. శుక్రవారం (అక్టోబర్ 11) అర్థరాత్రి వారు జైలు నుంచి తప్పించుకున్నారు. దాంతో జైలులో ఎంతగా వెతికినా ఇద్దరు ఖైదీలు కనిపించకపోవడంతో జైలు అధికారులు శనివారం పోలీసులకు సమాచారం అందించారు. 

ఉత్తరాఖండ్‌లోని రూర్కీకి చెందిన పంకజ్‌కు హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. అలాగే ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాకు చెందిన రాజ్‌కుమార్ కిడ్నాప్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఇద్దరు ఖైదీలు జైలులో నిర్మాణ పనుల్లో భాగంగా కార్మికుల కోసం గోడపైకి ఎక్కేందుకు అక్కడ ఉంచిన నిచ్చెన‌ను ఉపయోగించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 

ఈ ఘటన జరిగినప్పుడు చాలా మంది ఖైదీలతో పాటు జైలు సిబ్బంది కూడా రామలీలాను వీక్షిస్తున్నారు. దీంతో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆరుగురు జైలు అధికారులను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది

పారిపోయిన ఇద్దరు ఖైదీలను పట్టుకునేందుకు ముమ్మ‌రంగా ద‌ర్యాప్తు చేస్తున్నామని, వారిని గుర్తించేందుకు సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు. ఇక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏటా రోష్నాబాద్ జైలులో రామలీలా నిర్వహించ‌డం జరుగుతుంది. ఇందులో ఖైదీలు పాల్గొంటారు.
Roshnabad Jail
Uttarakhand
Ramleela

More Telugu News