Job Resign: ఉద్యోగంలో చేరిన రోజే రిజైన్ చేసిన వ్యక్తి

A product designer resigned on his first day at a new job due to toxic work conditions

  • విషపూరితమైన పని పరిస్థితులు, మేనేజర్ డిమాండ్లు భరించలేక తొలి రోజే ఉద్యోగానికి రాజీనామా
  • అదనపు చెల్లింపులు లేకుండానే రోజుకు 12 - 14 గంటలు పని చేయమంటున్నారని వెల్లడి
  • శ్రేయాస్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేసిన ‘రిజైన్ లెటర్’ వైరల్

ఇంటి దగ్గర నుంచే పని చేసే అవకాశం ఉండడంతో జీతం తక్కువే అయినప్పటికీ వేరే ఆలోచన లేకుండా ‘ప్రొడక్ట్ డిజైనర్’ ఉద్యోగంలో ఓ యువకుడు చేరాడు. అయితే అనూహ్యంగా ఉద్యోగంలో చేరిన రోజునే రాజీనామా చేశాడు. హానికరంగా ఉన్న పని పరిస్థితులు, మేనేజర్ అసంబద్ధమైన డిమాండ్‌లను చూసి ఈ నిర్ణయం తీసుకున్నానంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘రెడ్డిట్’ వేదికగా తన రిజైన్ లెటర్‌ను అతడు షేర్ చేశాడు. దీంతో రిజైన్ లెటర్ వైరల్‌గా మారింది. 

ఇంటి వద్ద నుంచే పని చేసే అవకాశం ఉండడంతో ఈ రంగం ఉద్యోగాల్లో ఉన్న జీతాల కంటే తక్కువ జీతం ఆఫర్‌కు అంగీకరించినట్టు శ్రేయాస్ అనే బాధిత వ్యక్తి తెలిపాడు. కంపెనీ యజమాని తనపై భారీ అంచనాలు పెట్టుకున్నాడని, అవన్నీ చూసి తన ఉత్సాహం నీరుగారిపోయిందని అతడు వాపోయాడు. అదనపు చెల్లింపులు లేకుండానే ఎక్కువ సమయం పనిచేయాలంటూ మేనేజర్ డిమాండ్ చేశాడని శ్రేయాస్ వెల్లడించాడు. వ్యాయామం, పుస్తక పఠనం వంటి వ్యక్తిగత అలవాట్లు ఉన్నాయని చెబితే.. పని-జీవిత సమతుల్యత అనే భావనను ‘పాశ్చాత్య దేశాల ప్రవర్తన’తో ముడిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

అక్టోబరు 7న ఉద్యోగంలో చేరానని, ముందుగా మేనేజర్ అంగీకరించిన 9 గంటల షిఫ్టుకు మించి ఎక్కువ సమయం పని చేయాలనడంతో షాక్ అయ్యానని శ్రేయాస్ పేర్కొన్నాడు. అదనపు చెల్లింపు లేకుండానే 12 నుంచి 14 గంటల పని చేయాలని మేనేజర్ చెప్పారని, వర్క్ పరిమితులు అడిగితే ఎగతాళి చేశారని శ్రేయాస్ మండిపడ్డాడు. రీడింగ్, ఎక్సర్‌సైజ్‌ వంటి అలవాట్లపై చులకనగా మాట్లాడారని వివరించారు.

మేనేజర్‌ వ్యక్తిగత దాడులకు దిగుతుండడం, అతడి కించపరిచే ప్రవర్తన, పని-జీవిత సమతుల్యత విషయంలో అనైతిక వైఖరి ప్రదర్శించిన కారణంగా రాజీనామా చేస్తున్నట్టు తన రాజీనామా లేఖలో శ్రేయాస్ పేర్కొన్నాడు. విషపూరితమైన పని సంస్కృతి, వ్యక్తిగత అవమానాలు ఏమాత్రం భరించలేనివని పేర్కొన్నాడు. ఇతరులు కూడా తనలా వారి ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరాడు. దీంతో అతడి పోస్ట్‌కు నెటిజన్లు మద్దతు తెలిపారు. అలాంటి ప్రవర్తనకు వ్యతిరేకంగా నిలబడి ఉద్యోగానికి రాజీనామా చేసినందుకు చాలా మంది అభినందించారు. ఆఫీసుల్లో ఇబ్బందికరమైన పరిస్థితులపై నెటిజన్లు చర్చించుకున్నారు.

More Telugu News