Sanju Samson: హైదరాబాద్‌ టీ20లో రోహిత్ శర్మ రికార్డును బద్దలుకొట్టిన సంజూ శాంసన్

Sanju Samson has become the first Indian wicket keeper to hit a century in T20Is
  • టీ20ల్లో సెంచరీ సాధించిన తొలి వికెట్ కీపర్‌గా నిలిచిన సంజూ శాంసన్
  • బంగ్లాదేశ్‌లో అత్యంత వేగంగా 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించిన బ్యాట్స్‌మన్‌గా అవతరణ
  • వరుసగా అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో 4వ స్థానంలో నిలిచిన యువ ఆటగాడు
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా శనివారం రాత్రి భారత్- బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన 3వ టీ20 మ్యాచ్‌లో సంజూ శాంసన్ విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. కేవలం 47 బంతుల్లోనే 111 పరుగులు బాది ఔటయ్యాడు. ఈ క్రమంలో శాంసన్ పలు రికార్డులను నెలకొల్పాడు.

టీ20ల్లో సెంచరీ బాదిన తొలి భారత వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్ నిలిచాడు. టీ20 ఫార్మాట్‌లో భారత్ తరపున రెండవ వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు. శాంసన్ కేవలం 40 బంతుల్లో సెంచరీ బాదాడు. అయితే అతడి కంటే ముందు రోహిత్ శర్మ కేవలం 35 బంతుల్లో శతకం నమోదు చేశాడు. సెంచరీ విషయంలో రోహిత్ రికార్డును శాంసన్ బద్దలు కొట్టలేకపోయినా అర్ధ సెంచరీ విషయంలో రికార్డు సాధించారు. శాంసన్ కేవలం 22 బంతుల్లోనే అర్ధ సెంచరీ నమోదు చేశాడు. టీ20ల్లో బంగ్లాదేశ్‌పై ఏ భారత ఆటగాడికైనా ఇదే వేగవంతమైన అర్ధ సెంచరీగా నిలిచింది. ఈ విషయంలో రోహిత్ ఆల్ టైమ్ రికార్డును శాంసన్ బద్దలు కొట్టాడు. 2019లో బంగ్లాదేశ్‌పై హాఫ్ సెంచరీ నమోదు చేయడానికి రోహిత్ శర్మ 22 కంటే ఎక్కువ బంతులు ఆడాడు.

మరోవైపు టీ20 ఫార్మాట్‌లో సంజూ శాంసన్‌కు ఇదే తొలి సెంచరీ కావడం గమనార్హం. అతడి ఇన్నింగ్స్‌లో 8 సిక్సర్లు, 11 ఫోర్లు ఉన్నాయి. బంగ్లా లెగ్ స్పిన్నర్ రిషాద్ హొస్సేన్‌ వేసిన ఓ ఓవర్‌లో ఏకంగా వరుసగా ఐదు సిక్సర్లు బాదాడు. దీంతో ఒక ఓవర్‌లో వరుసగా అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో నాలుగువ స్థానంలో నిలిచాడు.

ఒక ఓవర్‌లో వరుసగా అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్లు..
1. యువరాజ్ సింగ్- వరుసగా 6 సిక్సర్లు.
2. డేవిడ్ మిల్లర్- వరుసగా 5 సిక్సర్లు.
3. కీరన్ పొలార్డ్ - వరుసగా 5 సిక్సర్లు.
4. సంజు శాంసన్ - వరుసగా 5 సిక్సర్లు.
Sanju Samson
Rohit Sharma
India vs Bangladesh
Cricket
Team India

More Telugu News