Nobel Prize: కృత్రిమ నాడీ వ్యవస్థలతో మెషీన్ లెర్నింగ్... భౌతికశాస్త్రంలో ఈ ఏడాది ఇద్దరికి నోబెల్ ప్రైజ్

Nobel Prize in Physics goes to  John J Hopfield and Geoffrey E Hinton
  • ప్రతిష్ఠాత్మక నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న హాప్ ఫీల్డ్, హింటన్
  • మెషీన్ లెర్నింగ్ కు పునాది అనదగ్గ విధానాలను అభివృద్ధి చేసిన ఇద్దరు శాస్త్రవేత్తలు
  • నోబెల్ ప్రైజ్ కింద రూ.9.23 కోట్ల నగదు బహుమతి
భౌతికశాస్త్రంలో ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్ ప్రైజ్ కు జాన్ జె హాప్ ఫీల్డ్, జెఫ్రీ ఈ హింటన్ ఎంపికయ్యారు. కృత్రిమ నాడీ వ్యవస్థలతో మెషీన్ లెర్నింగ్ ను సాధ్యం చేసేలా వీరిద్దరూ సిద్ధాంతపరమైన ఆవిష్కరణలకు రూపకల్పన చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను మరింత అభివృద్ధి చేసే దిశగా వీరి కృషికి గాను నోబెల్ ప్రైజ్ వరించింది. 

హాప్ ఫీల్డ్, జెఫ్రీ హింటన్ భౌతికశాస్త్ర సాధనాల సాయంతో... నేటితరం శక్తిమంతమైన మెషీన్ లెర్నింగ్ కు పునాది అనదగ్గ విధానాలను అభివృద్ధి చేశారని భౌతికశాస్త్రంలో నోబెల్ ప్రదానం చేసే రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వివరించింది. 

కాగా, నోబెల్ విజేతలకు రూ.9.23 కోట్ల నగదు బహుమతి లభించనుంది.

ఈ ఏడాది నోబెల్ విజేతల్లో ఒకరైన జెఫ్రీ ఈ హింటన్ ను 'గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ' గా పిలుస్తారు. టెక్నాలజీ ప్రపంచంలో ఆయన ఎంతో ప్రముఖ వ్యక్తిగా పేరొందారు. గతంలో గూగుల్ లో పనిచేసిన హింటన్ 2023లో ఆ సంస్థను వీడారు. ఆయన బ్రిటీష్ కెనడా జాతీయుడు. ప్రస్తుతం కెనడాలోని టొరంటో యూనివర్సిటీలో పనిచేస్తున్నారు.

ఇక, ప్రఖ్యాత అమెరికన్ శాస్త్రవేత్త జాన్ జె హాప్ ఫీల్డ్ నాడీ వ్యవస్థలపై చేసిన పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఆయన హింటన్ తో కలిసి అభివృద్ధి చేసిన మెషీన్ లెర్నింగ్ వ్యవస్థ హాప్ ఫీల్డ్ నెట్ వర్క్ గా ప్రఖ్యాతి పొందింది. హాప్ ఫీల్డ్ అమెరికాలోని ప్రిన్స్ టన్ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు.
Nobel Prize
Physics
John J Hopfield
Geoffrey E Hinton

More Telugu News