Tirumala Laddu Row: విజిలెన్స్ విచారణ అనగానే సుబ్బారెడ్డి ఎందుకు భయపడ్డారు?: హోంమంత్రి అనిత

AP Home Minister Anitha responds on Surpeme Court verdict over Tirumala Laddu row
  • తిరుమల లడ్డూ వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పు
  • స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
  • సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్న ఏపీ హోంమంత్రి అనిత
  • స్వతంత్ర సిట్ దర్యాప్తుతో నిజానిజాలేంటో అందరికీ తెలుస్తాయని వెల్లడి
తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంలో నిగ్గు తేల్చేందుకు స్వతంత్ర సిట్ ను ఏర్పాటు చేయాలని ఇవాళ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం విషయంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. 

లడ్డూ వ్యవహారం అనేది సెంటిమెంట్లతో కూడిన విషయం అని, కల్తీ జరిగిందని తెలిశాక రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలో అదే చేసిందని అన్నారు. కల్తీ జరిగిందన్న ఆరోపణలు రాగానే, వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగారని విమర్శించారు. 

సరిగ్గా గమనిస్తే... తప్పు చేయని వాళ్లు భయపడరు... కానీ విజిలెన్స్ విచారణ అనగానే వైవీ సుబ్బారెడ్డి ఎందుకు భయపడ్డారు? అని అనిత ప్రశ్నించారు. ఈ అంశాన్ని కూడా సుప్రీంకోర్టు నేడు ప్రస్తావించిందని వెల్లడించారు. 

సుప్రీంకోర్టు ఇవాళ ఇచ్చిన తీర్పు తమకు ఆమోదయోగ్యమేనని... సీబీఐ అధికారులు, స్థానిక పోలీసు ఉన్నతాధికారులతో కూడిన సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు చెప్పిందని వివరించారు. ఇప్పుడు నిజానిజాలు తేలాలి... సిట్ దర్యాప్తుతో వాస్తవాలేంటో అందరికీ తెలుస్తాయి అని అనిత స్పష్టం చేశారు. 
Tirumala Laddu Row
Supreme Court
SIT
Vangalapudi Anitha
YV Subba Reddy
TTD
Tirumala
TDP-JanaSena-BJP Alliance
YSRCP

More Telugu News