Nitish Kumar: నితీశ్ ప్రధాని అవుతారన్న మంత్రి జమాఖాన్... బీహార్‌లో మళ్లీ చెడుతున్న బీజేపీ-జేడీయూ బంధం

Nitish Kumar For PM JDU Leaders Comment Points To Rift With NDA Partner BJP
  • నితీశ్ కుమార్ ప్రధాని అయితే దేశం వేగంగా అభివృద్ది చెందుతుందన్న మంత్రి జమాఖాన్
  • ప్రధాని కుర్చీ ఖాళీ లేదన్న బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అజయ్ అలోక్
  • బీహార్‌లో నితీశ్‌ను గద్దెదింపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న ఆర్జేడీ
బీహార్‌లో బీజేపీ, జేడీయూ కూటమి మధ్య మరోమారు మాటల యుద్ధం మొదలైంది. ఇరు పార్టీల నేతలు చేస్తున్న ప్రకటనలతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. జేడీయూ నేత, మంత్రి జమాఖాన్.. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అజయ్ అలోక్ విభేదిస్తూ కనిపించారు. 

కేంద్రమంత్రిగా, దాదాపు 19 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన నితీశ్ కుమార్ ఈ దేశానికి ప్రధాని అవుతారని, ఆయనను ప్రధానిని చేయడంలో ప్రతిపక్షాలు కూడా మద్దతునిస్తాయని జమాఖాన్ పేర్కొన్నారు. నితీశ్ కుమార్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే కాంగ్రెస్‌తోపాటు అన్ని పార్టీలు మద్దతునిస్తాయని తెలిపారు. బీహార్ మాత్రమే కాకుండా దేశం మొత్తం ఆయన ప్రధాని కావాలని కోరుకుంటోందని చెప్పారు. ఆయన ప్రధాని అయితే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఆయనకు కుటుంబ నేపథ్యం లేదని, ఆయనపై ఎలాంటి మచ్చలేదని చెప్పుకొచ్చారు. 

ప్రధాని కుర్చీ ఖాళీ లేదు
జమాఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలు బీహార్‌లో కూటమి ప్రభుత్వం మధ్య విభేదాలకు కారణమయ్యాయి. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అజయ్ అలోక్ మట్లాడుతూ ప్రధాని పదవి ప్రస్తుతం ఖాళీగా లేదని అన్నారు. హిజ్బుల్లా చీఫ్ నస్రల్లాను ఇజ్రాయెల్ చంపినప్పటి నుంచి ప్రజలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారని చెప్పారు. జమాఖాన్ మంత్రి కాబట్టి నితీశ్‌ను ప్రధానిని చేసేందుకు కాంగ్రెస్ సహా ఇతర పార్టీలతో మాట్లాడాలని, వారికేం చెప్పాలో జమాఖాన్ కు నితీశ్ చెబుతారని పేర్కొన్నారు. 

బీజేపీ సంగతి జేడీయూకు అర్థమైంది
మరోవైపు, బీజేడీ, బీజేపీ మధ్య మాటల యుద్ధంపై ప్రతిపక్ష ఆర్జేడీ అధికార ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ స్పందించారు. నితీశ్‌ను సీఎం సీటు నుంచి దింపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ విషయం జేడీయూకు అర్థమైంది కాబట్టే నితీశ్‌ను ప్రధాని చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ కనుక ఇలాంటి పిచ్చి ప్రయత్నం ఏదైనా చేస్తే కేంద్రంలో ఎన్డీయేకు ఇస్తున్న మద్దతును జేడీయూ ఉపసంహరించుకుంటుందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి కుర్చీని డిమాండ్ చేయడానికి ముందు బీహార్‌లో నితీశ్‌ను రక్షించేందుకు జేడీయూ ప్రయత్నిస్తే మంచిదని హితవు పలికారు.
Nitish Kumar
BJP
JDU
Bihar
PM Chair

More Telugu News