Sensex: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. కారణం ఏంటంటే..!

Indian stocks fell sharply in early trade on Thursday amid rising geopolitical tensions between Israel and Iran
  • ఈక్విటీ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపిస్తోన్న ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు
  • 1 శాతానికి పైగా నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు
  • చమురు, గ్యాస్, ఉక్కు, బ్యాంకింగ్‌తో పాటు ఇతర రంగాల షేర్లలో అమ్మకాల జోరు
ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, ఈ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకొనడం గ్లోబల్ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి. భారత ఈక్విటీ మార్కెట్లలోనూ ఈ ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇవాళ (గురువారం) భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ఆరంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు తీవ్ర నష్టాల్లో కొనసాగుతున్నాయి.

సెన్సెక్స్ ఏకంగా 1,264.2 పాయింట్లు పతనమై 83,002.09 వద్ద ప్రారంభమైంది. ఇక నిఫ్టీ-50 సూచీ 345.3 పాయింట్లు దిగజారి 25,451.60 వద్ద ఆరంభమైంది. ఉదయం 11 గంటల సమయానికి సెన్సెక్స్ కాస్తంత కోలుకొని 954.50 పాయింట్లు అంటే 1.13 శాతం నష్టంతో 83,311.69 పాయింట్ల కదలాడుతోంది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ-50 సూచీ 11 గంటల సమయానికి 295.80 పాయింట్లు అంటే 1.15 శాతం నష్టపోయి 25,501.00 వద్ద ట్రేడ్ అవుతోంది.

మధ్య ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగొచ్చని, చమురు సరఫరాలో అంతరాయాలు ఏర్పడొచ్చనే భయాందోళనలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రతికూలంగా మార్చాయి. మార్కెట్లలో పెట్టుబడులను ఉపసంహరించుకునేందుకు మదుపర్లు మొగ్గుచూపారు.  చమురు, గ్యాస్, ఉక్కు, బ్యాంకింగ్‌తో పాటు ఇతర రంగాల షేర్లలో అమ్మకాల జోరు కనిపించింది.

ఇక ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో గ్లోబల్ మార్కెట్లలోనూ అనిశ్చితి పరిస్థితులు నెలకున్నాయి. బుధవారం రాత్రి అమెరికా మార్కెట్లు కూడా నష్టాల్లో ముగిశాయి. అయితే బ్యాంకింగ్ రంగ షేర్లు మాత్రం లాభాల్లో ముగిశాయి. ఇక జపనీస్ స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.
Sensex
Nifty
Stock Market
Iran
Israel

More Telugu News