Chiranjeevi: కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన మెగాస్టార్ చిరంజీవి

Megastar Chiranjeevi Responds Over Minister Konda Surekha Comments
  • చిత్ర పరిశ్రమలో దుమారం రేపిన కొండా సురేఖ వ్యాఖ్యలు
  • మంత్రి వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయన్న చిరంజీవి
  • ఇలాంటి దుర్మార్గపు మాటల దాడిని తామంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నామన్న మెగాస్టార్
తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. గౌరవమంత్రి చేసిన ఇలాంటి అవమానకరమైన వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయని ఆవేదన వ్యక్తం చేశారు. వార్తల్లో నిలిచేందుకు సెలబ్రిటీలు, సినీ పరిశ్రమకు చెందినవారు సాఫ్ట్ టార్గెట్లుగా మారడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్రపరిశ్రమకు చెందిన తామందరం ఇలాంటి దుర్మార్గపు మాటల దాడిని ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు.

రాజకీయ లబ్ధి కోసం రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులను, మరీ ముఖ్యంగా మహిళలను ఇలా రాజకీయాల్లోకి లాగడం, అసహ్యకరమైన కల్పిత ఆరోపణలు చేస్తూ ఈ స్థాయికి దిగజారడం సరికాదని చిరంజీవి హితవు పలికారు. సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకే మనం నాయకులను ఎన్నుకుంటామని, కానీ, ఇలాంటి వ్యాఖ్యల ద్వారా తమ స్థాయిని తగ్గించుకోవద్దని కోరారు. రాజకీయ నాయకులు, గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్నవారు ఉదాహరణగా నిలవాలి తప్పితే ఇలాంటి వ్యాఖ్యలు సరికావని పేర్కొన్నారు. ఇలాంటి హానికర వ్యాఖ్యలు చేసినవారు ఉపసంహరించుకుంటారని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్న మంత్రి!
చిరంజీవి స్పందించడానికి ముందే కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. నటి సమంతకు క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలపై అన్ని వర్గాల నుంచి, మరీ ముఖ్యంగా చిత్ర పరిశ్రమ నుంచి విమర్శల వర్షం కురవడంతో మంత్రి వెనక్కి తగ్గారు. మహిళల పట్ల ఓ నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించేందుకు మాత్రమే అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకున్నారు. స‌మంత మ‌నోభావాల‌ను దెబ్బ‌తీయాలన్నది తన ఉద్దేశం కాదని, స్వ‌యం శ‌క్తితో ఆమె ఎదిగిన తీరు త‌న‌కు ఆద‌ర్శమని పేర్కొన్నారు. త‌న వ్యాఖ్య‌ల వ‌ల్ల స‌మంత కానీ, ఆమె ఫ్యాన్స్ కానీ మ‌న‌స్తాపానికి గురైనట్టయితే బేష‌ర‌తుగా ఆ వ్యాఖ్య‌ల‌ను ఉప‌సంహ‌రించుకుంటున్న‌ట్లు సురేఖ పేర్కొన్నారు.
Chiranjeevi
Megastar
Konda Surekha
Samantha
Tollywood
KTR

More Telugu News