Dwayne Bravo: అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు డ్వేన్ బ్రావో వీడ్కోలు

West Indies Legend Dwayne Bravo Announces Retirement From All Forms Of Cricket
  • 21ఏళ్లు ప్రొఫెషనల్ క్రికెట్‌లో కొన‌సాగిన క‌రేబియ‌న్ స్టార్‌
  • టీ20 ఫార్మాట్‌లో అత్య‌ధిక‌ వికెట్లు తీసిన బౌలర్లలో అగ్రస్థానం
  • కరేబియన్‌ ప్రీమియర్ లీగ్‌లో గాయం కార‌ణంగా రిటైర్మెంట్ నిర్ణ‌యం
  • 2021లోనే అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్  
వెస్టిండీస్ స్టార్‌ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికాడు. వచ్చే నెలలో 41వ ఏట అడుగుపెడుతున్న బ్రావో.. 2021లోనే అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. ఆ త‌ర్వాత గతేడాది ఐపీఎల్‌లో అత‌డు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే), ఆఫ్ఘనిస్థాన్‌లకు కోచింగ్ స్టాఫ్‌గా సేవ‌లు అందించాడు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న‌ కరేబియన్‌ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్‌) సీజన్‌లో గాయం కారణంగా ఈ క‌రీబియ‌న్ స్టార్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 ఫార్మాట్‌లో అత్య‌ధిక‌ వికెట్లు తీసిన బౌలర్లలో బ్రావో అగ్రస్థానంలో ఉన్నాడు. తన అద్భుతమైన కెరీర్‌లో తనకు లభించిన మద్దతు, ప్రేమకు తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు.

"నాకు అన్నీ అందించిన ఆటకు ఈరోజు వీడ్కోలు పలుకుతున్నాను. ఐదేళ్ల వయస్సు నుండి నేను చేయాలనుకున్నది ఇదేనని నాకు తెలుసు. ఇది నేను ఆడాలని నిర్ణయించుకున్న క్రీడ. నాకు దేనిపైనా ఆసక్తి లేదు. నా జీవితమంతా మీకు అంకితం చేశాను. నా కోసం, నా కుటుంబం కోసం కలలుగన్న జీవితాన్ని నాకు క్రికెట్ ఇచ్చింది. అందుకు కృతజ్ఞతలు చెబుతున్నాను.

21ఏళ్ల‌ ప్రొఫెషనల్ క్రికెటర్‌గా ఎన్నో ఎత్తుపల్లాల‌తో నిండిన అద్భుతమైన ప్రయాణం ఇది. నా వ‌ర‌కు 100 శాతం ఆట‌ను అందించాను. నా మనసు ఇప్ప‌టికీ ఆట‌ను కొనసాగించాలని కోరుకుంటోంది. కానీ నా శరీరం స‌హ‌క‌రించ‌డంలేదు. ఒత్తిడిని భరించలేను. నా సహచరులను, నా అభిమానులను, ప్రాతినిధ్యం వహిస్తున్న జట్లను నిరాశపరచ‌డం ఇష్టం లేదు. ఈ రోజు క్రీడ నుండి రిటైర్‌మెంట్‌ను అధికారికంగా ప్రకటిస్తున్నాను." అని బ్రావో తన రిటైర్మెంట్ పోస్ట్‌లో పేర్కొన్నాడు.

"సంవత్సరాలుగా మీ అచంచలమైన ప్రేమ, మద్దతుకు కృతజ్ఞతలు చెబుతున్నాను. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ట్రినిడాడ్ అండ్‌ టొబాగోలో ఉన్న నా అభిమానులందరికీ ధన్యవాదాలు. నా కెరీర్ గురించి, ఈ నిర్ణయం గురించి నేను పశ్చాత్తాపపడను. మరొకసారి ప్రేమతో కలుస్తాను" అని బ్రేవో పేర్కొన్నాడు.

ఇక సీపీఎల్‌లో బ్రావో మొత్తం 107 మ్యాచ్‌లు ఆడాడు. 20.62 సగటు, 129.33 స్ట్రైక్ రేట్‌తో 1,155 పరుగులు చేశాడు. అలాగే 23.02 ఎక‌నామీతో 129 వికెట్లు తీశాడు.

మొత్తంగా టీ20 ఫార్మాట్‌లో బ్రావో 582 మ్యాచ్‌లలో 631 వికెట్లతో పొట్టి ఫార్మాట్‌లో ఒక బెంచ్‌మార్క్‌ని నెలకొల్పి తన అద్భుత‌మైన‌ కెరీర్‌ను ముగించాడు.
Dwayne Bravo
Team West Indies
Retirement
Cricket
Sports News

More Telugu News