Nara Lokesh: డిక్లరేషన్ సంప్రదాయాన్ని జగన్ పాటిస్తే బాగుంటుంది!: మంత్రి నారా లోకేశ్ సూచన

Nara Lokesh advises Jagan on declaration in Tirumala temple
  • దేవుడి జోలికెళితే ఏమవుతుందో జగన్ ఎన్నికల్లో చూశారన్న లోకేశ్
  • మనం ఏ మతానికి చెందినా, అన్ని మతాలను గౌరవించాలని హితవు
  • రెడ్ బుక్ పని ప్రారంభమైంది... తప్పుచేసిన వారిని వదలబోమని వార్నింగ్
శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం నేపథ్యంలో, మాజీ సీఎం జగన్ ఈ నెల 28న తిరుమల వెళ్లి శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలని నిర్ణయించుకోవడం తెలిసిందే. అయితే, జగన్ తన తిరుమల పర్యటన సందర్భంగా ఆలయంలో డిక్లరేషన్ ఇస్తే బాగుంటుందని ఏపీ మంత్రి నారా లోకేశ్ సూచించారు. మనం ఏ మతానికి చెందిన వారమైనా అన్నిమతాలను గౌరవించాలని హితవు పలికారు. 

తాము చర్చి, మసీదులకు వెళ్లినపుడు వారి మత విశ్వాసాలకు అనుగుణంగా నడుచుకుంటామని స్పష్టం చేశారు. జగన్ దేవుడి జోలికి వెళితే ఏమైందో గత ఎన్నికల్లో మీరంతా చూశారు అని లోకేశ్ వ్యాఖ్యానించారు. శ్రీకాకుళంలో ఓ పాఠశాల పరిశీలన అనంతరం లోకేశ్ మీడియాతో మాట్లాడారు. 

"తిరుమల వెళతానంటున్న జగన్ డిక్లరేషన్ ఇచ్చే సాంప్రదాయాన్ని పాటిస్తే బాగుంటుంది. తిరుమల లడ్డూ నాణ్యతా లోపంతో పాటు అనేక సమస్యలను భక్తులు యువగళం పాదయాత్రలో నా దృష్టికి తెచ్చారు. అధికారంలోకి వచ్చాక టీటీడీని ప్రక్షాళన చేయాలని ఈవోకు చెప్పాం. 

నెయ్యి సరఫరా చేసే కంపెనీ టర్నోవర్ రూ.250 కోట్లు ఉండాలన్న నిబంధనను వైవి సుబ్బారెడ్డి రూ.150 కోట్లకు తగ్గిస్తూ ఎందుకు సవరించారు? తిరుమలలో జరిగిన అవకతవకలపై నిగ్గు తేల్చేందుకు కమిటీ వేశాం. ఆ కమిటీ విచారణలో వాస్తవాలు బయటకు వస్తాయి. ఇప్పుడు తిరుమల లడ్డూ క్వాలిటీ బాగుందని వైసీపీ ప్రజాప్రతినిధులు కూడా చెబుతున్నారు.

జగన్ మాదిరి మేం పారిపోయే వ్యక్తులం కాదు!

జగన్ లా మేం పారిపోయే వ్యక్తులం, కాదు. ఇప్పటికే పెన్షన్లు, మెగా డిఎస్సీ హామీలను అమలు చేశాం. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలెండర్లు ఇస్తామని ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించారు. పథకాల అమలుపై మాకు చిత్తశుద్ధి ఉంది. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాం. 

జగన్ లా పరదాలు కట్టుకుని మేం తిరగడంలేదు. తప్పు చేయకపోతే వారు ఎందుకు భయపడ్డారు? ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలమధ్య ప్రజావేదిక నిర్వహిస్తున్నారు. 

సాక్షి చదివినా,చూసినా ఆరోగ్యానికి హానికరం

సాక్షి చదివినా, చూసినా ఆరోగ్యానికి హానికరం. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ చేయబోమని కేంద్రమంత్రి కుమారస్వామి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టంగా చెప్పారు. 

ప్రైవేటీకరణ లేదని నేను, మా ఎమ్మెల్యేలందరం నిన్న స్పష్టంచేశాం. విశాఖ ఉక్కును బతికించడం కోసం నిధులు మంజూరు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కేంద్రాన్ని కోరారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారు. వైసీపీ నాయకులు ఎందుకు కంగారు పడుతున్నారో అర్థం కావడం లేదు. 

ఇటీవల వరదలు సంభవించిన సమయంలో కష్టకాలంలో ఉన్న ప్రజలకు మేం అండగా నిలబడ్డాం. జగన్ ప్రజాధనంతో 2 బుల్లెట్ ప్రూఫ్ కార్లు కొనుక్కున్నారు కానీ ఏ నాడు జనం ముందుకు వెళ్లలేదు. ఎవరు అసలైన ప్రజానాయకులో రాష్ట్రప్రజలకు అర్థమైంది.

రెడ్ బుక్ పని ఇప్పటికే ప్రారంభమైంది

 ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వారికి శిక్ష తప్పదని నేను చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నా. ఆ ప్రకారం ఇప్పటికే రెడ్ బుక్ అమలు ప్రారంభమైంది. చట్టాన్ని అతిక్రమించి తప్పు చేసిన వారిని వదిలేది లేదు. ఇందులో భాగంగా ఐపీఎస్ లు కూడా సస్పెండ్ అయ్యారు. రైట్ ప్లేస్ లో రైట్ పర్సన్ ఉండాలన్నదే మా ప్రభుత్వ అభిమతం.



Nara Lokesh
Jagan
Declaration
Tirumala
TDP-JanaSena-BJP Alliance
YSRCP

More Telugu News