KTR: నా మీద కక్షను రేవంత్ రెడ్డి సిరిసిల్ల నేతన్నల మీద తీర్చుకుంటున్నాడు: కేటీఆర్

KTR alleges Revanth Reddy targetting Sircilla
  • సిరిసిల్ల ప్రజలు, నేతన్నల మీద పగ తీర్చుకుంటున్నారన్న కేటీఆర్
  • కాంగ్రెస్ హయాంలో నేతన్నల ఆత్మహత్యలు జరిగాయని విమర్శ
  • కాంగ్రెస్ నిర్ణయంతో ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు బంద్ అయ్యాయని విమర్శ
రాజకీయంగా తన మీద ఉన్న కోపంతో రాజన్న సిరిసిల్ల ప్రజల మీద, నేతన్నల మీద పగ తీర్చుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వకపోవడంతో నేతన్నల కుటుంబాల రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్లలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో నేతన్నల ఆత్మహత్యలు జరిగాయన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే తమ పార్టీ తరఫున రూ.50 లక్షలు పద్మశాలి ట్రస్ట్‌కు ఇచ్చి సిరిసిల్లను ఆదుకున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నేతన్నల కుటుంబాలకు అండగా నిలిచామన్నారు. కేసీఆర్ నేతన్నలకు ఉపాధి కల్పించి వారి కడుపు నింపారన్నారు. స్కూల్ యూనిఫామ్స్‌తో పాటు కేసీఆర్ కిట్‌లోని రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుకకు ఇచ్చే చీరలను సిరిసిల్లలో తయారు చేయించినట్లు చెప్పారు.

కాంగ్రెస్ ప్ర‌భుత్వం దివాలాకోరు నిర్ణ‌యం వ‌ల్ల రాష్ట్రంలోని కోటిమందికి పైగా ఆడ‌బిడ్డ‌ల‌కు బ‌తుక‌మ్మ చీర‌లు బంద్ అయ్యాయని మండిపడ్డారు. బ‌తుక‌మ్మ చీర‌ల పంపిణీ ప‌థ‌కం వెనుక ఉన్న ఉద్దేశం, ఆలోచ‌నపై ఈ సీఎంకు, ప్ర‌భుత్వానికి క‌నీస అవ‌గాహ‌న లేదని విమర్శించారు. నేత‌న్న‌ల స‌మ‌స్య‌ల‌పై అసెంబ్లీలో చెప్పే ప్ర‌య‌త్నం చేశానన్నారు. తన మీద రాజ‌కీయ క‌క్ష‌ ఉంటే తన మీదే తీర్చుకోవాలని, కానీ నేత‌న్న‌ల‌ను ఇబ్బంది పెట్టవద్దని కోరారు. ఇది దివాలాకోరు, ప‌నికిమాలిన ప్ర‌భుత్వమని ధ్వజమెత్తారు.
KTR
Revanth Reddy
Telangana
BRS

More Telugu News