KTR: ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే ఏమిటి?: రేవంత్ రెడ్డికి కేటీఆర్ ప్రశ్నల వర్షం

KTR questions Revanth Reddy about Innovative Thinking
  • గత ప్రభుత్వం చేసిన పనులను మీ ఖాతాలో వేసుకోవడమా? అని ఎద్దేవా
  • ఆరు గ్యారెంటీలంటూ ఊదరగొట్టి కొత్త డ్రామాలు సృష్టించడమా? అని నిలదీత
  • తన అన్నదమ్ములు ఇప్పుడు వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్నారని చెప్పడమా? అని చురక
ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే ఏమిటని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. గత ప్రభుత్వం చేసిన పనులను మీ ఖాతాలో వేసుకోవడమే ఇన్నోవేటివ్ థింకింగ్ అంటారా? అని ఎద్దేవా చేశారు.

ఎన్నికలకు ముందు ప్రజలకు అడ్డగోలు హామీలు ఇచ్చి తర్వాత మాట తప్పడం, దేవుళ్ళ మీద ఒట్టేసి వారికి కూడా శఠగోపం పెట్టడం ఇన్నోవేటివ్ థింకింగ్ అంటారా? అని ప్రశ్నించారు. నూరు రోజులు... ఆరు గారంటీలు అని ఊదరగొట్టి తర్వాత వాటిని మర్చిపోవడం, ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రతిరోజూ ఒక కొత్త డ్రామా సృష్టించి, హెడ్‌లైన్ మేనేజ్‌మెంట్ చేయడమా? అని చురక అంటించారు.

గత ప్రభుత్వం ఇచ్చిన 30 వేల ఉద్యోగాలు మనమే ఇచ్చినట్టు బిల్డప్ ఇవ్వడం, గతంలో ఒక్క డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కట్టలేదని చిల్లర మాటలు మాట్లాడి, ఇప్పుడు 15 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మీరే కట్టినట్లు ఫోజులు కొట్టడమేనా అని విమర్శించారు. అర్హతలు లేని బావమరిది కంపెనీకి వేల కోట్ల ప్రజా సొమ్ము కట్టబెట్టడమా? అని ప్రశ్నించారు. 

గతంలో కుటుంబపాలన అని విమర్శించి... ఇప్పుడు మాత్రం ఇదివరకు అడ్రస్ లేని తన అన్నదమ్ములు వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నారంటూ మభ్యపెట్టడమే ఇన్నోవేటివ్ థింకింగ్ అంటారా? అని ఎత్తిపొడిచారు.

తెలంగాణతల్లికి కేటాయించిన స్థలాన్ని ఢిల్లీ బాసులకు ధారాదత్తం చేయడం... ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం, తర్వాత చేరలేదని బుకాయించడం... ఫార్మా సిటీ రద్దు అని బయట చెప్పడం, హైకోర్టులో మాత్రం రద్దు చెయ్యలేదని న్యాయమూర్తులను కూడా మోసం చేయడం... ఇష్టారీతిన పేదల ఇళ్లు కూల్చడం, బ్రదర్ ఇల్లు మాత్రం ముట్టుకోకపోవడం... ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయని పేర్కొన్నారు.
KTR
Revanth Reddy
Telangana
BRS

More Telugu News