Hydraa: హైడ్రా భయంతో కుంట అలుగు తెంపిన స్థానికులు

The natives were paralyzed with fear of the hydra
  • వర్షాలకు నీటితో నిండిన కుంట
  • నీళ్లు తమ ఇళ్లల్లోకి వస్తే హైడ్రా దృష్టి పడుతుందని టెన్షన్
  • కుంట అలుగు ధ్వంసంపై అధికారులకు సమాచారం అందించిన జనం
హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను గుర్తించి హైడ్రా కూల్చివేతలు చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ కూల్చివేతల భయంతో మంచిరేవులలో కొంతమంది స్థానికులు వర్షాలకు నీటితో నిండిన కుంట అలుగును తెంపేశారు. కుంట పూర్తిగా నిండడం, మళ్లీ వర్షం పడితే వరద తమ ఇళ్లల్లోకి వస్తుందనే ఆలోచనతో ఈ పని చేశారు. వరద నీరు వచ్చి చేరితే హైడ్రా దృష్టి ఎక్కడ తమ ఇళ్లపై పడుతుందోననే భయంతో పొక్లెయిన్ తెప్పించి మరీ అలుగు తెంపారు. 

అసలేం జరిగిందంటే..
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మంచిరేవుల వీరభద్రస్వామి గుట్టకు వెళ్లేదారిలో ఎకరం 29 గుంటల విస్తీర్ణంలో ఉన్న మల్లన్న కుంట నిండింది. దీంతో తమ ఇళ్ల వద్దకు నీరు చేరే అవకాశం ఉందని, వరద ముంచెత్తితే హైడ్రా ఎక్కడ తమ ఇళ్లపైకి వస్తుందోనని కొంతమంది స్థానికులు ఆందోళన చెందారు. ఆ ప్రమాదం లేకుండా సోమవారం పొక్లెయిన్‌ తీసుకువచ్చి అలుగును కొంత తొలగించి నీటిని బయటికి వదిలారు.

ఈ చర్యలను మరికొంతమంది అడ్డుకుని అధికారులకు సమాచారం అందించారు. దీనిపై తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి స్పందించి వీఆర్ఏలను అక్కడికి పంపించారు. వీఆర్‌ఏలు బి.మల్లేష్, అచ్యుత్‌లు అలుగును పరిశీలించి స్థానికులను విచారించారు. అనంతరం విషయాన్ని నీటిపారుదల శాఖ అధికారులకు తెలియజేశారు. కుంట అలుగు ధ్వంసం చేసిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
Hydraa
Water Pond
Manchirevula

More Telugu News