Gautam Gambhir: ప్రధాన కోచ్‌గా తొలి టెస్ట్ విజయంపై గంభీర్ తొలి స్పందన

Gautha Gambhir says A fantastic start and Well done boys on Indias first test win under coaching
  • అద్భుతమైన ఆరంభమన్న గంభీర్
  • బాగా ఆడారంటూ ఆటగాళ్లకు ప్రశంస
  • సోషల్ మీడియా వేదికగా స్పందన
భారత జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన గౌతమ్ గంభీర్‌కు టెస్ట్ ఫార్మాట్‌లో శుభారంభం లభించింది. బంగ్లాదేశ్‌పై గెలుపుతో ఆయన పర్యవేక్షణలోని టీమిండియాకు తొలి టెస్ట్ మ్యాచ్‌ విజయం దక్కినట్టు అయింది. ఈ శుభ సందర్భంపై గంభీర్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.  

‘‘అద్భుతమైన ఆరంభం! బాగా ఆడారు అబ్బాయిలూ!’’ అని వ్యాఖ్యానించాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రత్యేక సందేశాన్ని పోస్ట్ చేశాడు. ఒక ఫొటోను కూడా గంభీర్ షేర్ చేశాడు. ఈ ఫొటోలో కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు పలువురు ఆటగాళ్లు మైదానంలోకి నడిచి వెళుతూ కనిపించారు.

కాగా జులై నెలలో శ్రీలంక పర్యటనతో టీమిండియా ప్రధాన కోచ్‌గా గంభీర్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. తొలుత టీ20 సిరీస్.. ఆ తర్వాత వన్డే సిరీస్‌ను భారత్ ఆడింది. టీ20 సిరీస్‌ను గెలిచినప్పటికీ వన్డే సిరీస్‌లో భారత్ అనూహ్యంగా ఓటమిపాలైంది.

ఇదిలావుంచితే.. చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 515 పరుగుల భారీ విజయ లక్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ఆరంభించిన బంగ్లాదేశ్ కేవలం 234 పరుగులకే ఆలౌట్ అయింది. దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 6 వికెట్లతో రాణించాడు. దీంతో భారత్ 280 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది.
Gautam Gambhir
Cricket
Team India
India vs Bangladesh

More Telugu News