Tirumala Laddu: తిరుమల లడ్డూ కల్తీ అంశం: జగన్ పై నిప్పులు చెరిగిన బుచ్చి రాంప్రసాద్

TDP leader Buchi Ram Prasad fires on Jagan over Tirumala Laddu issue
  • తిరుమల లడ్డూ వివాదం
  • లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు
  • ఏపీలో తీవ్ర రాజకీయ దుమారం
  • జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చి రాంప్రసాద్ నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాజీ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ ప్రభుత్వంలోని వ్యవస్థలన్నింటిని నాశనం చేశారని, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని కూడా వదల్లేదని మండిపడ్డారు.  

2023 ఆగస్టు3నే తాము తిరుపతి లడ్డూల నాణ్యత గురించి మాట్లాడామని వెల్లడించారు. తిరుపతి లడ్డూలో నాణ్యత లేదని, సరైన నెయ్యి వాడటంలేదని, సరైన పదార్థాలు లడ్డూలో ఉండటంలేదని ఇదే వేదిక పై సమావేశం ఏర్పాటు చేసి చెప్పామని బుచ్చి రాంప్రసాద్ వివరించారు. 

"గతంలో వైసీపీ ప్రభుత్వం రకరకాల కంపెనీల నుంచి ఆవు నెయ్యిని కొనుగోలు చేసింది. నెయ్యి సరఫరాలో కూడా రివర్స్ టెండరింగ్ పాలసీని అవలంబించారు. టీడీపీ హయాంలో తయారు చేసిన లడ్డూలో జీడిపప్పు, బాదం, కిస్ మిస్ లు ఎక్కువగా ఉండేవి. జగన్ హయాంలో అవి కనపడేవి కాదు. 

ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో తయారవుతున్న తిరుపతి లడ్డూల్లో పెద్ద పెద్ద జీడిపప్పు, బాదం, కిస్ మిస్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు నాణ్యమైన లడ్డూ తయారవుతోంది. వైసీపీ హయాంలో లడ్డూ ఎండిపోయినట్టుగా, క్రికెట్ బాల్ లాగా గట్టిగా ఉండేది. ప్రస్తుతం పట్టుకుంటేనే మృదువుగా ఉంటోంది. 

తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లినవారు ఇంటికొచ్చేదాకా నాన్ వెజ్ తినరు. కానీ, వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తినిపించి నాన్ వెజ్ తినేలా చేశారు. పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూను అపవిత్రం చేశారు. తిరుపతి లడ్డూలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు పదార్థాలు కలుస్తున్నాయని చంద్రబాబు చెప్పినప్పుడు విని బాధపడ్డాను. 

బ్రాహ్మణులు నాన్ వెజ్ తినరని అందరికీ తెలుసు. జంతు కొవ్వు కలిపిన నెయ్యితో తయారైన లడ్డూలను తిన్నామని తెలిస్తే...  పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. తెలియక తప్పు చేస్తే ఏ విధంగా ఆ తప్పును సరి చేసుకోవచ్చో ఆగమ శాస్త్రం తెలిసినవారిని అడుగాలి. నాన్ వెజ్ తిననివారు తెలియక తినేస్తే ఏం చేయాలో తెలుసుకొని సరిదిద్దుకోవాలి. ఆగమ శాస్త్రం తెలిసిన వారు ఏ విధంగా ఈ దోషం వదలుతుందో ప్రెస్ రిలీజ్ చేయాలి. 

ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి లడ్డూను రాజకీయాలకు వాడుకుంటున్నాడని జగన్ చెప్పడం హాస్యాస్పదం. అలిపిరిలో చంద్రబాబు పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి నాకు మరో జన్మ ఇచ్చారని చెప్పారు. ఆయన ఎప్పుడూ టీటీడీని రాజకీయాలకు వాడుకోలేదు. అటువంటి ఆలోచన జగన్ కే ఉంది. 

జగన్ ఐదేళ్లలో ఒక్కసారైనా భార్యా సమేతంగా తిరుమల వెళ్లారా? వెంకటేశ్వర స్వామినే ఇంటికి తెప్పించుకున్న ఘనత జగన్ కే దక్కుతుంది. ప్రధాన మంత్రికి లెటర్ రాసి చంద్రబాబుకు అక్షింతలు వేయాలంటున్నారు. చంద్రబాబుకు కాదు మీకు పడతాయి అక్షింతలు! 

జగన్ చేసిన తప్పులను ప్రజలు గమనించే ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారు. జగన్ చేసిన తప్పులు అన్ని బయటికి రావాలి. అవన్నీ ప్రజలకు తెలియాలి" అని బుచ్చి రాంప్రసాద్ స్పష్టం చేశారు.
Tirumala Laddu
Buchi Ram Prasad
Jagan
TDP
YSRCP

More Telugu News