Bengaluru Crime: బెంగళూరులో ఘోరం.. మహిళను 30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌‌లో దాచిపెట్టిన హంతకుడు

Young woman murdered at her home and body chopped into 30 pieces
  • రెండ్రోజులుగా ఇంట్లోంచి దుర్వాసన
  • ఇరుగుపొరుగువారి ఫిర్యాదుతో ఘాతుకం వెలుగులోకి
  • నిందితుల కోసం గాలిస్తున్న 8 బృందాలు
  • ఆమె వివాహిత అని, కుమారుడు కూడా ఉన్నట్టు గుర్తింపు
  • ఒంటరిగా జీవిస్తూ ఓ మాల్‌లో పనిచేస్తున్న బాధితురాలు
కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం జరిగింది. ఒంటరిగా నివసిస్తున్న యువతిని హత్య చేసిన నిందితుడు 30  ముక్కలుగా కోసి శరీరభాగాలను ఫ్రిడ్జ్‌‌లో దాచిపెట్టాడు. సంచలనం సృష్టించిన ఈ కేసును ఛేదించేందుకు పోలీసులు 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నగరంలోని వ్యాలికవల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వీరన్న భవన్‌లో జరిగిందీ ఘటన. 

మృతురాలిని 26 ఏళ్ల మహాలక్షిగా గుర్తించారు. ఆమెది పశ్చిమ బెంగాల్ కానీ, చత్తీస్‌గఢ్ కానీ అయి ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించారు. గత రెండ్రోజులుగా బాధితురాలి ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో ఇరుగుపొరుగువారు ఆమె బంధువులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. నిన్న ఆమె తల్లి, సోదరి ఇంటికి వచ్చి చూసి దిగ్భ్రాంతికి గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫిడ్జ్‌లో కుక్కిన శరీరభాగాలను చూసి షాకయ్యారు. రిఫ్రిజిరేటర్ పనిచేస్తున్నప్పటికీ శరీర భాగాలు కుళ్లిపోయి వాసన వస్తున్నట్టు గుర్తించారు. ఈ నెల మొదట్లోనే మహాలక్ష్మిని హత్య చేసి పదునైన ఆయుధంతో ఆమె శరీర భాగాలను ముక్కలుగా కోసి ఫ్రిడ్జ్‌లో కుక్కినట్టు అనుమానిస్తున్నారు.

ఓ ప్రముఖ మాల్‌లో పనిచేస్తున్న మహాలక్ష్మి రోజూ ఉదయం వెళ్లి రాత్రి పొద్దుపోయాక ఇంటికి చేరుకుంటుంది. ప్రస్తుతం ఉంటున్న ఇంట్లో ఆమె ఐదారు నెలలుగా నివసిస్తోంది. ఆమె ఒంటరిగానే ఉంటోందని, ఎవరితోనూ పెద్దగా కలవదని, ఇటీవల కొన్ని రోజులుగా ఆమె సోదరుడు కూడా కనిపించాడని ఇరుగుపొరుగువారు తెలిపారు. ఆమె వివాహిత అని, ఆమెకు ఓ కుమారుడు కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. భర్తను రాణాగా గుర్తించి అతడిని ప్రశ్నించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘాతుకానికి ఒక్క వ్యక్తే పాల్పడి ఉంటాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Bengaluru Crime
Karnataka
Woman Chopped
Crime News

More Telugu News