Tirumala Laddu: దమ్ముంటే తిరుపతికి వచ్చి ప్రమాణం చేయాలి: వైవీ సుబ్బారెడ్డికి నారా లోకేశ్ సవాల్

Nara Lokesh challenges YV Subbareddy on Tirumala Laddu issue
  • తీవ్ర రూపు దాల్చిన తిరుమల లడ్డూ వ్యవహారం
  • చంద్రబాబు ఆరోపణలను ఖండించిన వైవీ సుబ్బారెడ్డి
  • వైవీ అహంకార ధోరణితో మాట్లాడుతున్నారన్న నారా లోకేశ్
  • రెడ్ బుక్ చూస్తే వైసీపీ నేతలు హడలిపోతున్నారని వెల్లడి
తిరుమల లడ్డూ వ్యవహారం క్రమంగా తీవ్రరూపం దాల్చుతోంది. గత ప్రభుత్వ హయాంలో వెంకటేశ్వరస్వామి లడ్డూలో జంతువుల కొవ్వు వాడారని సీఎం చంద్రబాబు ఆరోపించడం, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆ వ్యాఖ్యలను ఖండించడం తెలిసిందే. కుటుంబంతో సహా వచ్చి ప్రమాణం చేస్తానని, చంద్రబాబు కూడా వచ్చి ప్రమాణం చేయాలన్నారు. దీనిపై ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు.

వైవీ సుబ్బారెడ్డికి దమ్ముంటే తిరుపతికి వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. నేను తిరుపతిలోనే ఉన్నా... వైవీ వస్తారా? అని అడిగారు. నాటి వైసీపీ ప్రభుత్వం సామాన్య భక్తులను స్వామివారికి దూరం చేసిందని విమర్శించారు. ధరలను విపరీతంగా పెంచేసిందని ఆరోపించారు. ధరలు పెంచితే ఏమవుతుందని నాడు వైవీ అహంకార ధోరణితో మాట్లాడారని మండిపడ్డారు. పింక్ డైమండ్ ను కూడా రాజకీయం చేశారని ఆరోపించారు. 

వైసీపీ ప్రభుత్వ హయాంలో చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్లు ఇవాళ నా రెడ్ బుక్ చూస్తే భయపడుతున్నారు అని వ్యాఖ్యానించారు. రేణిగుంట విమానాశ్రయం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో లోకేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

"అన్న ప్రసాదంలో నాణ్యత లేదు, తిరుమల లడ్డూ సైజుతో పాటు నాణ్యత కూడా తగ్గిపోయింది. నేను చంద్రగిరిలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆ ఏడుకొండల వైపు చూసి జగన్ కు చెప్పాను... మీరు ఆ ఏడుకొండల జోలికి వెళ్లొద్దు... సర్వనాశనం అయిపోతారని చెప్పాను. కానీ వినలేదు. తిరుమలలో కనీవినీ ఎరుగని అవినీతి చేశారు. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారు" అని వివరించారు.
Tirumala Laddu
Nara Lokesh
YV Subba Reddy
TDP
YSRCP

More Telugu News