Tirumala Laddu: మా స్వామి మీకేం పాపం చేశాడ్రా దరిద్రుల్లారా!: ఆనం వెంకటరమణారెడ్డి ఫైర్

Anam Venkataramana Reddy press meet on Tirumala Laddu controversy
  • తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు
  • చంద్రబాబు సంచలన ఆరోపణలు
  • గుజరాత్ ల్యాబ్ లో స్పష్టమైందన్న ఆనం వెంకటరమణారెడ్డి
గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నాణ్యమైన నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారంటూ సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ నేతలు సవాళ్లు విసురుతున్నారు. 

ఈ నేపథ్యంలో, టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించి వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు. కొవ్వును కరిగించి తీసిన నూనెను స్వామివారి లడ్డూల్లో వాడతారేంట్రా దరిద్రుల్లారా...  మా స్వామి మీకేం పాపం చేశాడ్రా! అంటూ మండిపడ్డారు.

గుజరాత్ లోని నేషనల్ డెయిరీ డెవలప్ మెంట్ బోర్డు ల్యాబ్ లో శాంపిల్స్ పరీక్షించగా, సంచలన విషయాలు వెల్లడయ్యాయని తెలిపారు. తిరుమల లడ్డూ తయారీలో గొడ్డు మాంసం కొవ్వు, ఫిష్ ఆయిల్, కుళ్లిన జంతుమాంసం కొవ్వు వాడారని ఆరోపించారు. అవి ఏ జంతువులైనా కావొచ్చని, కుక్కలు, పిల్లుల మాంసం కావొచ్చని వ్యాఖ్యానించారు. 

ఇదంతా తాడేపల్లి ప్యాలెస్ వైఎస్ ల్యాబ్ లో కాదని, గుజరాత్ లోని ల్యాబ్ లో పరీక్షించారని అన్నారు. గుజరాత్ లోని నేషనల్ డెయిరీ డెవలప్ మెంట్ బోర్డు ల్యాబ్ భారత్ లోనే కాదు, ప్రపంచంలోనే అత్యుత్తమ ల్యాబ్ లలో ఒకటి అని ఆనం వెంకటరమణారెడ్డి వివరించారు. చెన్నై నుంచి నెల్లూరుకు కుక్కల మాంసం వస్తుంటుందని, ఎన్నోసార్లు కుక్క మాంసం పట్టుబడిందని వెల్లడించారు. ఇప్పుడు కుక్క మాంసం కొవ్వును కూడా వెంకటేశ్వరస్వామి లడ్డూ తయారీలో వాడారని భయం కలుగుతోందని చెప్పారు. 

ఏందిరా ఇదంతా... తిరుమల వెంకన్నస్వామి లడ్డూలో గొడ్డు మాంసం కొవ్వు కలుపుతారా? కుళ్లిపోయిన జంతువుల కొవ్వు నుంచి తీసిన నూనెను స్వామివారి లడ్డూల్లో వాడతారా? ఎంతటి అపచారం! 

జగన్ మోహన్ రెడ్డి, ఆయన బంధువులు దేవుడ్ని నమ్మరు... మేం ఈ విషయాన్ని పదేపదే చెబుతున్నాం. వాళ్లకు వెంకటేశ్వరస్వామిపై నమ్మకం లేదన్న విషయం ఇవాళ రుజువైంది... ఇవాళ ప్రతి హిందువు స్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకుని, దీపం వెలిగించి స్వామివారిని క్షమాపణ కోరండి... తప్పు ఎవరు చేసినా హిందువులమైన మనందరం భరించాలి.. ఈ పాపం మనకు తగలకుండా చూసుకుందాం" అని ఆనం వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు.
Tirumala Laddu
Anam Ramanarayana Reddy
Chandrababu
YSRCP
TTD

More Telugu News