Greece: గ్రీస్‌లో ఇళ్ల కొనుగోలుకు క్యూలు కట్టిన భారతీయ ఇన్వెస్టర్లు

Greece has witnessed surge in property purchases by Indian investors between July and August
  • గోల్డెన్ వీసా స్కీమ్ కింద శాశ్వత నివాసం కోసం పరుగులు
  • ఆగస్టు 31 వరకు రూ.2.2 కోట్ల కనీస పెట్టుబడితో శాశ్వత నివాసానికి ఛాన్స్
  • సెప్టెంబర్ 1 నుంచి రూ.7 కోట్లకు పెరిగిన పరిమితి
  • అందుకే జులై-ఆగస్టు నెలల్లో పెద్ద సంఖ్య ఇళ్ల కొనుగోళ్లు
గ్రీస్‌లో ఇళ్ల కొనుగోలు కోసం భారతీయ పెట్టుబడిదారులు ఎగబడ్డారు. జులై-ఆగస్టు మధ్య కాలంలో అక్కడ ఇళ్లు కొనుగోలు చేసిన ఇండియన్ ఇన్వెస్టర్ల సంఖ్య ఏకంగా 37 శాతం మేర పెరిగింది. 

దేశంలో రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం ఇవ్వడమే లక్ష్యంగా ఆ దేశం 2013లో ప్రవేశపెట్టిన ‘గోల్డెన్ వీసా ప్రోగ్రామ్’ ఇందుకు కారణమైంది. ఈ ప్రత్యేక పథకం కింద విదేశీ పౌరులు 250,000 యూరోల (సుమారు రూ. 2.2 కోట్లు) కనీస ప్రాపర్టీ ఇన్వెస్ట్‌మెంట్‌తో శాశ్వత నివాసాన్ని పొందవచ్చు. అయితే ఈ కనీస పరిమితిని 800,000 యూరోలకు (సుమారు రూ.7 కోట్లు) పెంచుతూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

2024 సెప్టెంబర్ 1 నుంచి ఈ నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. అందుకే ఈ పరిమితి అమల్లోకి రాకముందే సెప్టెంబర్ 1 లోపే ఇళ్ల కొనుగోళ్లకు భారతీయ ఇన్వెస్టర్లు త్వరపడ్డారు. పెద్ద సంఖ్యలో ప్రాపర్టీలు సొంతం చేసుకున్నారు.

కాగా గోల్డెన్ వీసా ప్రోగ్రామ్ ప్రవేశపెట్టిన గ్రీస్ అనుకున్న లక్ష్యాన్ని దాదాపు సాధించింది. అక్కడి రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంది. యూరోపియన్ యూనియన్ వెలుపలి దేశాల ప్రజలు ఇక్కడ పెద్ద సంఖ్యలో ఇళ్లను కొనుగోలు చేశారు. దీంతో అక్కడి ఇళ్లకు భారీ డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా ఏథెన్స్, థెస్సలోనికి, మైకోనోస్, సాంటోరిని వంటి నగరాల్లోని ప్రాపర్టీలకు భారీ గిరాకీ లభించింది. అందుకే గ్రీస్ ప్రభుత్వం ఇన్వెస్ట్‌మెంట్ పరిమితిని పెంచింది.
Greece
Indian investors
Viral News

More Telugu News