Munirathna: అరెస్ట్ అయిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేపై అత్యాచారం కేసు

Rape case filed against arrested Karnataka BJP MLA Munirathna
  • కాంట్రాక్టర్‌ను బెదిరించి, కులం పేరుతో దూషించిన కేసులో ఎమ్మెల్యే మునిరత్న అరెస్ట్
  • ఆయన బెయిలు పిటిషన్‌పై నేడు తీర్పు ఇవ్వనున్న ప్రత్యేక కోర్టు
  • బెయిలుపై బయటకు వచ్చిన వెంటనే అత్యాచారం కేసులో అరెస్ట్ చేస్తామన్న పోలీసులు
  • బెయిలు ఇవ్వకున్నా కస్టడీలోకి తీసుకుంటామని స్పష్టీకరణ
  • సామాజిక కార్యకర్త ఫిర్యాదుతో అత్యాచారం కేసు నమోదు
ఓ కాంట్రాక్టర్‌ను బెదిరించడమే కాకుండా కులం పేరుతో ఆయనని దూషించిన కేసులో అరెస్ట్ అయిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై అత్యాచారం కేసు నమోదైంది. ప్రస్తుతం బెంగళూరు కేంద్ర కారాగారంలో ఉన్న ఆయన ఓ సామాజిక కార్యకర్తపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయనపై రేప్ కేసు నమోదు చేశారు. కాగా, ఆయన పెట్టుకున్న బెయిలు పిటిషన్‌ పై ప్రత్యేక కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. 

నేడు ఆయనకు కోర్టు బెయిలు ఇచ్చినా జైలు నుంచి అడుగు బయటపెట్టిన వెంటనే రేప్ కేసులో ఎమ్మెల్యేను అరెస్ట్ చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. ఒకవేళ కోర్టు బెయిలు నిరాకరిస్తే బాడీ వారెంట్‌పై కస్టడీలోకి తీసుకుంటామని వివరించారు. తనకు పరిచయమైన మునిరత్న తరచూ తనకు ఫోన్లు చేస్తూ సాన్నిహిత్యం పెంచుకున్నారని, ఆ తర్వాత ముత్యాలనగర్‌లోని ఓ గోడౌన్‌కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిని ఆయన రికార్డు చేశాడని, విషయం బయటకొస్తే ఆ వీడియోలను బయటపెడతానని బెదిరించారని పేర్కొన్నారు. అంతేకాదు, తనను హనీట్రాప్‌కు ఉపయోగించుకోవాలని కూడా చూశారని ఆరోపించారు. ఈ కేసులో ఎమ్మెల్యే అనుచరులు ఆరుగురిపైనా కేసులు నమోదయ్యాయి.
Munirathna
Karnataka
BJP MLA
Crime News

More Telugu News