Ricky Ponting: రికీ పాంటింగ్ సర్‌ప్రైజ్... ఐపీఎల్‌లో ఢిల్లీని వీడి మరో జట్టు కోచ్‌గా ఒప్పందం

Reports saying Ricky Ponting was appointed head coach of Punjab Kings
  • పంజాబ్ కింగ్స్ జట్టు కోచ్‌గా ఒప్పందం కుదుర్చుకున్న పాంటింగ్
  • మంగళవారమే సంతకాలు చేసిన ఆస్ట్రేలియా దిగ్గజం
  • ఢిల్లీ జట్టుతో ఏడేళ్ల ప్రయాణానికి ముగింపు
వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుని వీడి పంజాబ్ కింగ్స్ ప్రధాన కోచ్‌గా అతడు ఒప్పందం కుదుర్చుకున్నాడు. తన దేశానికే చెందిన ట్రెవర్ బేలిస్ స్థానంలో ఈ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ మేరకు పంజాబ్ కింగ్స్ నేడు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ‘పంటర్ ఈజ్ పంజాబ్. పంజాబ్ జట్టు కొత్త కోచ్‌గా నియమితుడయ్యాడు’’ అని ప్రకటనలో పేర్కొంది.

తనకు హెడ్ కోచ్‌గా అవకాశం కల్పించిన పంజాబ్ కింగ్స్‌ జట్టుకు తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానని పాంటింగ్ ప్రకటించాడు. కొత్త సవాలును స్వీకరించడానికి ఆనందిస్తున్నానని పేర్కొన్నాడు. యజమానులు, మేనేజ్‌మెంట్‌‌లతో సంప్రదింపులు చేశానని, జట్టు విషయంలో వారి విజన్ చూసి ఉప్పొంగిపోయానని అన్నాడు. పంజాబ్ కింగ్స్‌ను సరికొత్తగా ముందుకు తీసుకెళతానని, అది అందరూ చూస్తారని ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు.

పాంటింగ్ మంగళవారమే ఒప్పందంపై సంతకం చేశాడని, నాలుగు సంవత్సరాలపాటు కోచ్‌గా కొనసాగనున్నాడని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి. పటిష్టమైన జట్టును రూపొందించేందుకు పాంటింగ్‌కు తగిన సమయం ఉందని, మిగతా సహాయక సిబ్బందిపై పాంటింగ్ నిర్ణయం తీసుకుంటాడని వివరించాయి. 

కాగా రికీ పాంటింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు దాదాపు ఏడేళ్ల పాటు పని చేశాడు. అతడి ఆధ్వర్యంలో 2020లో ఫైనల్‌కు చేరినప్పటికీ టైటిల్‌ దక్కలేదు. ఇక ముంబయి ఇండియన్స్‌ జట్టుకు కూడా కోచ్‌గా పాంటింగ్ పనిచేశాడు. 

ఇదిలావుంచితే 2008లో ఐపీఎల్ ప్రారంభమవగా... పంజాబ్ కింగ్స్ జట్టు ఒక్కసారి కూడా ఐపీఎల్‌ని గెలవలేదు. ఆస్ట్రేలియాకు ప్రపంచ కప్‌లు అందించిన కెప్టెన్‌గా పాంటింగ్ కు విశేష అనుభవం ఉండడంతో పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ సహ యజమానులు అతడి వైపు మొగ్గుచూపినట్టు తెలుస్తోంది.
Ricky Ponting
Punjab Kings
Delhi Capitals
IPL
Cricket

More Telugu News