Delhi CM: అఫ్జల్ గురు ఉరితీతను వ్యతిరేకించిన ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి చేతిలో ఢిల్లీని పెడతారా?: బీజేపీ

In BJPs First Strike At Next Delhi CM Atishi A Reference Of Afzal Guru

  • మహిళలను డమ్మీలుగా ఉపయోగించుకుంటున్నారని ఆరోపణ
  • అతిశీ తల్లిదండ్రులు అఫ్జల్ గురు ఉరితీతను వ్యతిరేకించారని వెల్లడి
  • ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీకి గుణపాఠం చెబుతారన్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు

ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిశీని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) లెజిస్లేటివ్ పార్టీ ఎన్నుకున్న విషయం తెలిసిందే. ఈ నెలాఖరున జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలలో అతిశీ ప్రమాణస్వీకారం ఉంటుందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

అయితే, అతిశీని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడంపై బీజేపీ మండిపడుతోంది. ఆమె పప్పెట్ సీఎంగా మారనుందని విమర్శలు గుప్పిస్తోంది. మహిళలను డమ్మీలుగా ఉపయోగించుకోవడం ఆమ్ ఆద్మీ పార్టీకి అలవాటుగా మారిందని బీజేపీ నేతలు ఆరోపించారు. 

ఈ విషయంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ... అతిశీ పూర్తి పేరు ఏంటి, ఆ పేరుకు అర్థమేంటో ఆప్ నేతలు తెలుసుకోవాలని హితవు పలికారు. పార్లమెంట్ పై దాడికి సూత్రధారి ఉగ్రవాది అఫ్జల్ గురుకు కోర్టు ఉరిశిక్ష విధిస్తే.. ప్రమాదకరమైన ఆ ఉగ్రవాదికి క్షమాభిక్ష కోసం అతిశీ తల్లిదండ్రులు ప్రయత్నించారని గుర్తుచేశారు. 

అఫ్జల్ గురుకు క్షమాభిక్ష ప్రసాదించాలంటూ రాష్ట్రపతికి రాసిన లేఖలో అతిశీ తల్లిదండ్రులు విజయ్ సింగ్, త్రిప్తా వాహి సంతకాలు చేశారని ఆరోపించారు. వారు నక్సలైట్ల మద్దతుదారులని చెబుతూ, అలాంటి బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తికి ఢిల్లీ పాలనా బాధ్యతలు అప్పగించడం ఏంటని కిరణ్ రిజిజు మండిపడ్డారు. ఢిల్లీ ప్రజలను ఎవరితో పాలించాలని చూస్తున్నారంటూ అప్ నేతలను ప్రశ్నించారు. 

అరవింద్ కేజ్రీవాల్ తీసుకున్న ఈ నిర్ణయానికి ఢిల్లీ ప్రజలు తప్పకుండా ఆయనకు గుణపాఠం చెబుతారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దీనికి మూల్యం చెల్లించుకుంటుందని మంత్రి జోస్యం చెప్పారు.

Delhi CM
Atishi
Afzal Guru
AAP
Atishi Parents
  • Loading...

More Telugu News