Jagga Reddy: కేసీఆర్, కేటీఆర్ నాలుకలు కూడా కోస్తాం... కేసీఆర్ తాతలు విజయనగరం నుంచి వచ్చారు: జగ్గారెడ్డి

KCR grand fathers came from Vijayanagaram says Jagga Reddy
  • రేవంత్ రెడ్డిని తిడితే నాలుకలు కోస్తామన్న జగ్గారెడ్డి
  • ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ ను డిస్టర్బ్ చేస్తున్నారని మండిపాటు
  • కేసీఆర్ సీఎం అయిన రోజే రాజకీయాల్లో విలువలు నశించాయని విమర్శ
తమ నాయకుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిడితే... కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిట్టిన వాళ్ల నాలుకలు కోస్తారని ఆ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. కేటీఆరే కాదు ఆయన బాబు కేసీఆర్ నాలుక కూడా కోస్తామని హెచ్చరించారు. రేవంత్ పై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో జగ్గారెడ్డి ఈమేరకు స్పందించారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ ను చెడగొట్టాలని చూస్తున్నారంటూ బీఆర్ఎస్ పై మండిపడ్డారు. 

వినాయక నిమజ్జనం కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని విమర్శించారు. పోలీసులు వినాయక నిమజ్జనం బందోబస్తు చూసుకోవాలా? లేక బీఆర్ఎస్ నేతల పంచాయితీ చూసుకోవాలా? అని ప్రశ్నించారు. అరెకపూడి గాంధీ, కౌశిక్ రెడ్డిల గొడవ ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని అన్నారు. 

హరీశ్ రావు నీకు సిగ్గుందా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడిన పదేళ్ల తర్వాత ప్రాంతీయతత్వాన్ని ఎందుకు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ తాతలు విజయనగరం నుంచి వచ్చారని చెప్పారు. అధికారం పోయిన తర్వాత కేటీఆర్ కు, బీఆర్ఎస్ నేతలకు ఏమీ అర్థం కావడం లేదని... అందుకే రోడ్లపై పడుతున్నారని ఎద్దేవా చేశారు.

పార్టీలు మారిన నేతలకు కండువాలు కప్పే సాంప్రదాయం ఉమ్మడి ఏపీలో ఉండేది కాదని... కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఈ సాంప్రదాయానికి తెర లేపారని విమర్శించారు.2014-18 మధ్య కాలంలో కాంగ్రెస్ కు చెందిన నలుగురు ఎంపీలు, 25 మంది ఎమ్మెల్యేలు, 18 మంది ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ లో చేరినప్పుడు ఆ పార్టీ నేతలు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. పార్టీ మారిన నేతలకు కేసీఆర్ మంత్రి పదవులు ఇచ్చారని దుయ్యబట్టారు. పార్టీ ఫిరాయింపులకు కేసీఆర్ ఆద్యుడని, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన రోజే రాజకీయాల్లో విలువలు నశించాయని చెప్పారు.
Jagga Reddy
Revanth Reddy
Congress
KCR
KTR
BRS
Harish Rao

More Telugu News