RG Kar Medical College case: కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారం కేసులో కీలక పరిణామం

Accused in RG Kar Medical College case Sanjoy Roy will now undergo Narco Analysis Test

  • నిందితుడు సంజయ్ రాయ్‌పై నార్కో అనాలిసిస్ టెస్ట్‌ నిర్వహణకు నిరాకరించిన కోర్టు
  • సీబీఐ విజ్ఞప్తిని తిరస్కరించిన సీల్దా కోర్టు
  • పాలిగ్రాఫ్ టెస్టులో నిందితుడు చెప్పిన విషయాలను క్రాస్ చెక్ చేయాలని భావిస్తున్న దర్యాప్తు సంస్థ

కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ-హాస్పిటల్ ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారం కేసులో ఇవాళ (శుక్రవారం) కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌పై నార్కో అనాలిసిస్ టెస్ట్ నిర్వహించేందుకు సీబీఐ అనుమతి కోరగా కోర్టు నిరాకరించింది.

నిందితుడు సంజయ్ రాయ్ కొన్ని వాస్తవాలను దాస్తున్నాడని, పాలిగ్రాఫ్ టెస్టులో ఈ విషయం ప్రతిబింబించిందని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. అందుకే నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయాలనుకుంటున్నామని, ఈ మేరకు అనుమతి ఇవ్వాలంటూ కోల్‌కతాలోని సీల్దా కోర్టును ఇవాళ ఉదయం సీబీఐ కోరింది. అభ్యర్థనను పరిశీలించిన న్యాయస్థానం నార్కో అనాలిసిస్ టెస్టుకు అభ్యంతరం వ్యక్తం చేసింది. సీల్దా కోర్టు న్యాయమూర్తి సంజయ్ రాయ్‌తో మాట్లాడిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ కేసులో నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్ నిజం చెబుతున్నాడో లేదో క్రాస్-చెక్ చేయడానికి నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయాలనుకున్నామని సీబీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. అతడు చెప్పే విషయాలను ధృవీకరించడానికి నార్కో పరీక్ష తమకు సాయపడుతుందని సదరు అధికారి తెలిపారు.

నార్కో అనాలిసిస్ టెస్ట్‌లో సోడియం పెంటోథాల్ అనే డ్రగ్‌ను వ్యక్తి శరీరంలోకి ఇంజెక్ట్ చేస్తారని, మైకం కలిగించే స్థితికి తీసుకెళ్లి ఆలోచనలను తటస్థీకరిస్తారని సీబీఐ అధికారి ఒకరు చెప్పారు. నార్కో అనాలిసిస్ టెస్టులు జరిపిన ఎక్కువ సందర్భాల్లో నిందితులు అసలైన సమాచారాన్ని ఇస్తారని తెలిపారు.

కాగా ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్-హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌ ఆగస్టు 10న అరెస్టు అయ్యాడు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఏకైక నిందితుడిగా ఉన్న అతడు ప్రస్తుతం కోల్‌కతా ప్రెసిడెన్సీ జైలులో ఉన్నాడు. 

అతడి బెయిల్ పిటిషన్‌ గతవారమే తిరస్కరణకు గురైంది. కోర్టు అతడి కస్టడీని సెప్టెంబర్ 20 వరకు పొడిగించింది. కాగా ఈ కేసులో ఫోరెన్సిక్ ఆధారాలపై సీబీఐ దృష్టి సారించింది. బాధిత వైద్యురాలి శరీరంపై ఉన్న గాట్ల గుర్తులతో సరిపోల్చేందుకు సీబీఐ గురువారం రాయ్ నుంచి దంత ముద్రలు, లాలాజల నమూనాలను సేకరించింది.

RG Kar Medical College case
Sanjoy Roy
Narco Analysis Test
Kolkata
  • Loading...

More Telugu News