ప్రకాశం బ్యారేజీ వద్ద కొనసాగుతున్న బోట్ల తొలగింపు ప్రక్రియ
- ప్రకాశం బ్యారేజీ గేట్లకు ఢీ కొట్టిన పడవల తొలగింపుపై ముమ్మరంగా చర్యలు
- మూడు రోజులుగా పడవను అడ్డంగా కట్ చేస్తున్న సిబ్బంది
- బోట్ల తొలగింపునకు నిపుణులను పిలిపించిన జల వనరుల శాఖ అధికారులు
ఈ రోజు బోటును రెండు ముక్కలుగా చేసి బయటకు తరలించే ఏర్పాట్లు చేశారు. 40 టన్నులకు పైగా బరువు ఉన్న బోటును రెండు ముక్కలుగా చేయడంతో ఒక్కొక్కటీ 20 టన్నుల బరువు ఉంటుందని అధికారులు చెప్పారు. నదిలో తేలుతూ పది టన్నులు బరువు మోయగలిగే పది ఎయిర్ బెలూన్లు ఏర్పాటు చేసి వాటి సాయంతో బోటు భాగాలను బయటకు తీసేందుకు తొలుత ఏర్పాట్లు చేశారు. అయితే నదిలో 60 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండటంతో సాధ్యపడదని అధికారులు భావిస్తున్నారు. ఇక బోటు ముక్కలు నది లోపల చిక్కుకోకుండా వాటిని బయటకు తరలించేందుకు నిపుణులను రప్పించారు.
గతంలో గోదావరిలో కచ్చులూరు వద్ద మునిగిన బోటును వెలికి తీసిన బృందాన్ని విజయవాడకు పిలిపించారు. ఈరోజు మధ్యాహ్నం ముందుగా బ్యారేజీపైకి భారీ క్రేన్ లను తీసుకువచ్చి ముక్కలు చేసిన బోటు భాగాలను పైకి తీస్తారు. అనంతరం బ్యారేజీ వెనుక వైపు నుండి భారీ ఫంటును తీసుకొచ్చి బోటు విడిభాగాలను ఫంటుపైకి ఎక్కించి బయటకు తరలించేలా ప్లాన్ చేశారు. ఒకవేళ ఆ విధంగా కుదరకపోతే.. కోసిన బోటు భాగాన్ని మరో భారీ పడవకు కట్టి నదిలో వెనక్కి లాగడం ద్వారా బయటకు తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నానికి ఒక పడవను తొలగించిన తర్వాత మిగిలిన రెండు భారీ పడవలను తొలగించడంపై అధికారులు దృష్టి పెట్టనున్నారు.