Ganesh Immersion: గణేశుడి మెడలో రూ. 4 లక్షల విలువ చేసే బంగారు గొలుసు.. పొరపాటున అలాగే నిమజ్జనం చేసిన జంట

Couple Mistakenly Immerses Ganpati Idol With Rs 4 Lakh Gold Chain
  • బెంగళూరులోని విజయనగర ప్రాంతంలో ఘటన
  • పూజ సందర్శంగా గణేశుడి విగ్రహం మెడలో బంగారు గొలుసు వేసిన జంట
  • నిమజ్జనం సమయంలో దానిని తీయడం మర్చిపోయిన వైనం
  • గొలుసు కోసం వెతుకులాటలో 10 వేల లీటర్ల నీరు తోడివేత
  • పది గంటల సెర్చింగ్ తర్వాత దొరికిన గొలుసు
వినాయక చవితి సందర్భంగా ఇంట్లో గణేశుడికి పూజ చేసిన ఓ జంట విగ్రహం మెడలో రూ. 4 లక్షల విలువైన బంగారు గొలుసు వేసింది. ఆ తర్వాత ఆ గొలుసును తీయకుండానే నిమజ్జనం చేసేసింది. ఇంటికొచ్చాక గుర్తొచ్చి లబోదిబోమంది.

బెంగళూరులోని విజయనగర ప్రాంతంలో జరిగిందీ ఘటన. చవితి పండుగను ఇంట్లో ఘనంగా చేసుకున్న రామయ్య-ఉమాదేవి దంపతులు విగ్రహం మెడలో ఖరీదైన బంగారు గొలుసు వేశారు. ఆ తర్వాత పత్రులతో అలంకరించడంతో గొలుసు కనిపించలేదు. అనంతరం ఓ మొబైల్ ట్యాంకులో విగ్రహాన్ని నిమజ్జనం చేసేసి ఇంటికొచ్చారు.

ఆ తర్వాత వారికి గొలుసు విషయం గుర్తుకొచ్చింది. వెంటనే ఆగమేఘాలపై నిమజ్జనం చేసిన మొబైల్ ట్యాంకు వద్దకు వెళ్లి అక్కడి సిబ్బందితో విషయం చెప్పారు. ఆ సమయంలో అక్కడున్న ఓ కుర్రాడు విగ్రహం మెడలో గొలుసు చూశానని, కాకపోతే అది రోల్డుగోల్డుదని అనుకున్నానని చెప్పాడు. ఆ తర్వాత ఆ జంట పోలీసులు, ఎమ్మెల్యే ప్రియకృష్ణకు విషయం చెప్పారు. దీంతో ఆ గొలుసును వెతికి వారికి ఇవ్వాల్సిందిగా ఎమ్మెల్యే ఆదేశించారు. 

ఎమ్మెల్యే ఆదేశంతో మొత్తం పదిమంది మొబైల్ ట్యాంకులోకి దిగి గొలుసు కోసం గాలించారు. దాదాపు పది గంటల వెతుకులాట తర్వాత చైన్ దొరికింది. ఇందుకోసం మొత్తం 10 వేల లీటర్ల నీటిని తోడాల్సి వచ్చింది. అందులో అప్పటికే 300 విగ్రహాలను నిమజ్జనం చేయడంతో వెతకడం కష్టమైంది. మొత్తానికి పోయిన చైన్ తిరిగి దొరకడంతో ఆ జంట ఆనందానికి హద్దే లేకుండా పోయింది.
Ganesh Immersion
Ganesh Chavithi
Bengaluru

More Telugu News